
ఈ నేపథ్యంలో ఈ తరుణంలో.. కొత్త జిల్లాలకు సంబంధించి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వివాదం ఇది.ఈ జిల్లాను రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచుతూ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటుచేశారు.ఇక్కడ రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి.కానీ తమకు మదనపల్లెను జిల్లాకేంద్రంగా ప్రకటించాలని కోరుతూ భారతీయ అంబేద్కర్ సేన (బాస్) నిన్నటివేళ ర్యాలీ తీసింది.దీంతో ఈ వివాదం మరింత ముదరనుంది. కడప జిల్లా, రాజంపేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ స్థానాలలో పుంగనూరు మినహా మిగిలిన నియోజకవర్గాలను కలుపుకుని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయడంతో వివాదం రేగుతోంది. పుంగనూరును మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంచారు.అయితే రాజంపేట లోక్ సభ నియోజకవర్గాన్ని రాజంపేట జిల్లాగా ప్రకటించకపోవడంతో అసంతృప్తత రేగుతోంది. ప్రభుత్వ నిర్ణయం అనుసారం రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం పై అభ్యంతరాలు వస్తున్నాయి. ఇది తమకు ఆమోద యోగ్యం కాదని అంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రాజంపేట, రైల్వే కోడూరు రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓడిపోవడం ఖాయమని స్థానికంగా ఉన్న వైసీపీ నాయకత్వం చెబుతోంది. ఈ మేరకు రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రవి తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లడిస్తున్నారు.కావాలంటే రాయచోటిని,మదనపల్లెను కలిపి వేరే జిల్లాగా చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు.ఇదే సమయంలో టీడీపీ కూడా రంగంలోకి దిగి ఆందోళనలు చేస్తోంది.తమను కడపలో భాగంగా ఉంచాలని లేదా రాజంపేట జిల్లాను ప్రకటించాలని అంతేకాని అన్నమయ్య జిల్లాలో ఉండేదే లేదని రాజంపేట వాస్తవ్యులు,టీడీపీ నాయకులు పట్టుబడుతున్నారు.