ఏపీకి తుపాను ముప్పు తప్పిందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తీవ్ర తుపాను నుంచి అసని తుపానుగా మారిందని, ప్రస్తుతం అది దిశ మార్చుకుందని చెబుతున్నారు. తుపాను ఏర్పడే సమయంలో అది ఒడిశాని టార్గెట్ చేసిందని చెప్పారు అధికారులు.ఆ తర్వాత మచిలీపట్నం తీరానికి ముప్పు ఉందని అంచనా వేశారు. తాజాగా అది కూడా కాదని దాని రూట్ మ్యాప్ సరిగా లేదంటున్నారు. అసని బాపట్ల జిల్లాను కూడా టార్గెట్ చేసిందనే వార్తలు బాపట్ల, ప్రకాశం జిల్లా వాసుల్ని కలవర పెట్టాయి. తీరా తెల్లవారిన తర్వాత అసని, తీవ్ర తుపాను నుంచి కేవలం తుపానుగా మారిందని, రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశముందని చెబుతున్నారు అధికారులు.

ప్రస్తుతం అసని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు కోస్తా జిల్లాల్లో కూడా ఓ మోస్తరు జల్లులనుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో కూడా జల్లులు పడ్డాయి కానీ ఈ ఉదయం నుంచి వర్షం ఆగింది. అయితే సోమ, మంగళ వారాల్లో కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులు ప్రజల్ని భయపెట్టాయి. తుపాను తీవ్రతకు అవి అద్దం పట్టాయి. కానీ ఆస్థాయిలో వర్షం పడకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అసని ముప్పుని ముందుగానే అంచనా వేసిన అధికారులు ఎక్కడికక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. తీర ప్రాంతాల్లో మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

కడలి కల్లోలం..
అసని ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. శ్రీలంక తీరం నుంచి పడవలో ఏర్పాటు చేసిన ఓ బౌద్ధ మందిరం ఏపీ తీరానికి కొట్టుకు వచ్చింది. గతంలో ఇలాంటి ఓ మందిరమే నెల్లూరు జిల్లా తీరానికి కొట్టుకు వచ్చింది. ఇప్పుడు మరో మందిరం ఇలాగే ఏపీ తీరానికి కొట్టుకు రావడం విశేషంగా మారింది. కడలి కల్లోలం వల్ల తీర ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. ఉప్పాడ సముద్ర తీరం కోతకు గురైంది. అక్కడ కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఏపీలో ఇంటర్ పరీక్షను కూడా వాయిదా వేశారు అధికారులు. సీఎం జగన్ పర్యటన కూడా రద్దయింది. ప్రస్తుతం అధికారులంతా తుపాను మేనేజ్ మెంట్ పైనే దృష్టిసారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: