వినటానికి విచిత్రంగానే ఉన్న పొంగూరు నారాయణ అరెస్టకు తెలుగుదేశంపార్టీయే ప్రధాన కారణమని చెప్పకతప్పదు. 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీమంత్రి, టీడీపీ నేత నారాయణ పాత్రే కీలకమన్న ఆరోపణలపై ఆయన్ను ఏపీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. సరే తనకున్న సత్తాతో నారాయణ బెయిల్ పై బయటకు వచ్చేశారనుకోండి అది వేరే సంగతి. దీన్ని ప్రతిష్టగా తీసుకున్న ప్రభుత్వం నారాయణ బెయిల్ రద్దు చేయించే ఉద్దేశ్యంతో హైకోర్టులో పిటీషన్ వేయబోతోంది.





సరే బెయిల్, కోర్టులో పిటీషన్ విషయం ఎలాగున్నా దాదాపు మూడేళ్ళుగా చాలా లో ప్రొఫైల్ మైన్ టెన్ చేస్తున్న నారాయణ ఎందుకు అరెస్టయ్యారు ? ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ అండ్ కో చేసిన ఓవరాయాక్షన్ అనే చెప్పాలి. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్లు లీక్ కావటమన్నది ఇపుడే కొత్తకాదు. గత ప్రభుత్వాల హయాంలో కూడా చాలాసార్లే పేపర్లు లీకులయ్యాయి.  చంద్రబాబు హయాంలో కూడా లీకులు జరిగాయి. లీకేజీలకు నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్ధలపై ఉన్న ఆరోపణలకు కొదవేలేదు.





2014-19 మధ్యలో ప్రభుత్వ దన్నుతో నారాయణ విద్యాసంస్ధలు విపరీతంగా బలపడ్డాయి.  వందల స్కూళ్ళకు అనుమతులు లేకుండానే అడ్మిషన్లు ఇచ్చేసుకునే వాళ్ళని ఆరోపణలు చాలా ఉన్నాయి.  అలాంటిది తాజాగా జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయని టీడీపీ నానా గోలచేసింది. లీకేజీలకు జగన్, విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణే బాధ్యత వహించాలంటు నానా రచ్చచేసింది.





ఒకవైపు లీకేజీలు నారాయణ విద్యాసంస్ధ నుండే జరుగుతున్నట్లు ఆధారాలతో సహా బయటపడినా చంద్రబాబు, లోకేష్ అండ్ కో మాత్రం బురదచల్లటాన్ని ఆపలేదు. దీంతో ఒళ్ళుమండిన ప్రభుత్వం వెంటనే నారాయణను టార్గెట్ చేసింది. లీకేజీల వ్యవహారంలో నారాయణ స్కూల్ పాత్ర బయటపడినపుడైనా చంద్రబాబు, లోకేష్ కామ్ గా ఉండుంటే సరిపోయేది. ప్రభుత్వాన్ని గబ్బుపట్టిద్దామన్న దురాలోచనతో చేసిన ఓవర్ యాక్షనే చివరకు నారాయణ మెడకు చుట్టుకుంది. అందుకనే నారాయణ అరెస్టులో చంద్రబాబు, లోకేషే ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: