తన కొడుకుతో పెళ్లి చేసి, ఇంటికి కోడలిగా తెచ్చుకున్న అమ్మాయికి ఆ అత్తే రెండో పెళ్లి చేయడం ఎక్కడా చూసి ఉండం. అప్పుడెప్పుడో ఇదే కాన్సెప్ట్ తో పెళ్లి అనే ఓ సినిమా వచ్చింది. అయితే సినిమాలో భర్త శాడిస్ట్ కావడంతో కోడలి జీవితం కోసం అత్త అలాంటి నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడ కొడుకు చనిపోవడంతో ఆ బాధను సైతం దిగమింగుతుని ఆ అత్త కోడలికి కొత్త జీవితాన్నిచ్చింది. మధ్యప్ర దేశ్‌ కి చెందిన ఆ దంపతులు కోడలి విషయంలో చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. అత్తమామలంటే.. కోడళ్లను రాచిరంపాన పెడతారనే పేరుంది. కానీ ఇక్కడ తమ కొడుకు మృతి చెందినా, ఆ వార్తను దిగమింగుకుని కోడలికి కొత్త జీవితం ఇచ్చారు. కోడలికి తామే తల్లిదండ్రులుగా మారి మరో పెళ్లి చేశారు. అక్కడితో ఆగలేదు. తమ ఆస్తి మొత్తం ఆమెకే రాసిచ్చారు.

మధ్యప్రదేశ్‌ ధార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యుగ్ ప్రకాష్‌ తివారికి ప్రియాంక్ తివారి అనే కొడుకు ఉన్నాడు. భోపాల్ లోని ఓ కంపెనీలో అతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్. 2011లో అతనికి పెళ్లయింది. వారికి అనన్య అనే కుమార్తె కూడా ఉంది. అయితే 2021లో ప్రియాంక్ తివారీ కరోనా వల్ల చనిపోయారు. అప్పటినుంచి కోడలు, మనవరాలు ఆ కుటుంబంతోనే ఉంటున్నారు. వితంతువు అయిన కోడలు, తండ్రిలేని తొమ్మిదేళ్ల మనవరాలి భవిష్యత్‌ కోసం ప్రియాంక్ తివారీ పేరెంట్స్ మథనపడిపోయారు. ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కోడలిని కూతురులా భావించారు అత్తమామలు. మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. నాగ్ పూర్ కి చెందిన వరుణ్ మిశ్రాకు ఇచ్చి తమ కోడలికి పెళ్లి చేశారు. తమ సొంత ఖర్చుతో పెళ్లి చేయడమే కాకుండా తన కొడుకు కొనుగోలు చేసిన 60లక్షల రూపాయల విలువైన బంగ్లాను కూడా ఆమెకు రాసిచ్చారు. పెళ్లి తర్వాత ప్రియాంక్ కూతురు అనన్య కూడా అమ్మతో నాగ్ పూర్ వెళ్లిపోయింది. తమ జీవితం చరమాంకంలో ఉందని, కొడుకు చనిపోయినా తమ జీవితం వెళ్లిపోతుందని, కానీ కోడలి జీవితం అంధకారం కాకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వార్త వైరల్ గా మారింది. కోడలికి కొత్త జీవితాన్నిచ్చిన అత్తమామలను అందరూ అభినందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: