రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. షెడ్యూల్ ఎన్నికలకు ఉన్నది రెండేళ్ళే అయినా పొత్తుల విషయంలో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యపోరాటాల విషయంలో కానీ ప్రతిపక్షాలు కలవటంలేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిందే అని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు కానీ తమరెండు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని ఇద్దరు డైరెక్టుగా చెప్పటంలేదు. పోనీ అలాగని ఊరకుంటారా అంటే అదీలేదు. ఇద్దరికిద్దరూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమని వేర్వేరుగా చెబుతునే ఉన్నారు.





అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు, పవన్ కు బలంగా ఉన్నది. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా, డైరెక్టుగా చెప్పటానికి భయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం బీజేపీయే. ఇపుడు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, జనసేనతో కలుస్తామని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ఇదే సమయంలో బీజేపీ కలిసిరాకపోతే టీడీపీతో పొత్తుపెట్టుకుంటామని పవన్ కూడా ఎక్కడా చెప్పలేదు. కారణం ఏమిటంటే బీజేపీని కాదంటే ఎలాంటి పరిస్ధితులు ఎదురవుతాయో అనే భయం.





నిజానికి ఏపీలో బీజేపీకున్న బలం దాదాపు సున్నా. అలాంటిది బీజేపీని చూసి 38 శాతం ఓటుబ్యాంకున్న టీడీపీ, 5.6 శాతం ఓట్లున్న జనసేన ఎందుకు భయపడుతున్నాయి ? ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండటమే ప్రధాన కారణం. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగానే రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. బీజేపీ ఓకే అంటే మాత్రమే టీడీపీ-జనసేన పొత్తులు సాధ్యమవుతాయి. ఎన్నికలనాటికి కూడా టీడీపీతో కలవటానికి బీజేపీ ఇష్టపడకపోతే పవన్ చేయగలిగేది చాలా తక్కువే. 






ఎందుకంటే టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోగానే బీజేపీ వెళ్ళి వైసీపీతో పొత్తుపెట్టుకుంటే ? ఈ కారణంగా కేంద్రంనుండి పై రెండుపార్టీల నేతలకు ఇబ్బందులు మొదలైతే ? ఈ కారణంగానే ఇటు బీజేపీని ఒప్పించలేక అటు బీజేపీని పక్కకు తోసేయలేక చంద్రబాబు, పవన్ నానా ఇబ్బందులు పడుతున్నారు. సో ఎన్నికలు దగ్గరపడేంత వరకు పై రెండుపార్టీల విషయంలో బీజేపీయే రింగ్ మాస్టర్ అని అర్ధమవుతోంది. మరి చంద్రబాబు విషయంలో బీజేపీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: