గతంలో ప్రజారాజ్యం కోసం మెగా అభిమానులంతా కలిశారు, అంతకంటే ముఖ్యంగా మెగా హీరోలంతా ఒక్కటయ్యారు. చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత మెగా హీరోల సందడితో ప్రతి కార్యక్రమం హైలెట్ గా నిలిచేది. ప్రచారంలో సినీ సందడి బాగా కనపడేది. చిరంజీవిని సీఎం చేయడం కోసం మెగా హీరోలంతా ఏకమయ్యారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారు. కానీ, మెగా హీరోలంతా పవన్ కోసం కదలిరాలేదు. పవన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పడం వరకు ఓకే కానీ, జనసేన తరపున ప్రచారం మాత్రం చేయలేదు. ఇప్పుడున్న సిచ్యుయేషన్ చూస్తుంటే 2024 ఎన్నికల్లో జనసేన తరపున మెగా హీరోలు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఈమేరకు మెగా అభిమానులు మాత్రం ఇప్పుడు ఏకమయ్యారు.

ఇటీవల విజయవాడలోని ఓ హోటల్ లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ అభిమానులు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకున్నారు. మెగా అభిమానులు వేరు, బన్నీ అభిమానులు వేరు అనే విభజన ఉంది కాబట్టి.. వారు మాత్రం ఈ మీటింగ్ కి రాలేదు. మెగా అభిమానులు పెట్టుకున్న సమావేశంలో, వారి బ్యానర్ లో అల్లు అర్జున్ ఫొటో కూడా లేకపోవడం విశేషం. అయితే అల్లు అర్జున్ ఎప్పుడూ పవన్ కల్యాణ్ గురించి గొప్పగా చెబుతుంటారు. గతంలో ప్రజారాజ్యంతో అల్లు అరవింద్ పాత్ర చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు జనసేనలో కేవలం మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు మాత్రమే లీడ్ తీసుకుంటున్నారు.

2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని సీఎం చేసే లక్ష్యంతో తామంతా పనిచేస్తామంటూ మెగా అభిమానులు ఆ మీటింగ్ లో తేల్చి చెప్పారని అంటున్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకెళతామని వారంతా తీర్మానించారట. వచ్చే ఎన్నికల్లో మెగా అభిమానులంతా జనసేన కార్యకర్తలుగా పనిచేస్తారని కూడా తీర్మానం చేశారని అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ, అభిమానులు కలిసినంత మాత్రాన జనంలోకి ఆ మెసేజ్ కరెక్ట్ గా వెళ్లదు. పవన్ కల్యాణ్ కోసం చరణ్, అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే ఆ కిక్కే వేరు. అప్పుడు కచ్చితంగా అభిమానులంతా ఒకేతాటిపైకి వస్తారు. ఆ పనిచేయగలిగితే.. ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మెగా హీరోలంతా ఏకతాటిపైకి వచ్చారని, మెగా అభిమానులంతా సంబరపడతారు. పార్టీ సంగతి పక్కనపెడితే.. కనీసం పవన్ కల్యాణ్ గెలుపుకి ఇది కచ్చితంగా దోహదపడుతుంది. మరి పవన్ కల్యాణ్ కోసం మెగా హీరోలు తమ షూటింగ్ లను కాస్త పక్కనపెట్టి ఎన్నికల హడావిడి మొదలైన తర్వాత జనంలోకి వస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: