టీడీపీ మహానాడులో మొదటి రోజు వెంకాయమ్మ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇటీవల సీఎం జగన్ పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనకు పింఛన్ రావట్లేదని, కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో పింఛన్ నిలిపేశారని ఆమె గుంటూరు కలెక్టరేట్ వద్ద స్పందన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆమెపై దాడి జరిగిందని కేసు కూడా నమోదైంది. ఇంటికెళ్లిన వాలంటీర్ పై ఆమే కావాలని దాడి చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆమె మీడియాలో బాగా హైలెట్ అయ్యారు. ఇప్పుడు అదే వెంకాయమ్మ మహానాడులో కూడా సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

జిల్లా స్థాయి నాయకులకు చాలామందికి మహానాడు వేదికపై మాట్లాడే అవకాశం రాదు.  అలాంటిది వెంకాయమ్మకు మాత్రం ఆ అవకాశం దక్కింది. రాష్ట్రంలో ఆడవాళ్లు పట్టపగలు రోడ్లపై తిరగాలంటే భయపడిపోతున్నారని మహానాడులో చెప్పారు వెంకాయమ్మ. ఇది రాజన్న రాజ్యం కాదని, రౌడీ రాజ్యం అని దుయ్యబట్టారు. అవసరమైతే జనాల కిడ్నీలు అమ్ముకుని చంపేసే రాజ్యం అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

పింఛన్ మొత్తాన్ని 200 రూపాయలనుంచి 2వేల రూపాయలకు పెంచింది చంద్రబాబు అని, జగన్ 3 వేలు ఇస్తానని చెప్పి మూడేళ్లకు గాను కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచారని విమర్శించారు. 5 రూపాయలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను కూడా ఎత్తివేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయంలో వచ్చిన నష్టాలతో పురుగు మందు తాగి చనిపోతున్నారని అన్నారు వెంకాయమ్మ. గుంటూరు కలెక్టరేట్ వద్ద తాను చేసిన ఆరోపణలపై ఇప్పటికీ తనను వేధిస్తున్నారని చెప్పారు వెంకాయమ్మ.

గుంటూరు జిల్లా కంతేడుకి చెందిన వెంకాయమ్మకు మహానాడు తరపున ప్రత్యేక ఆహ్వానం అందించారు నేతలు. ఆమె మాట తీరు, విమర్శల ఘాటు జనాలకు బాగా రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ఆమెకు ప్రత్యేకంగా ఛాన్స్ ఇచ్చారు. ఆ అవకాశాన్ని వెంకాయమ్మ కూడా సద్వినియోగం చేసుకుందనే చెప్పాలి. స్టేజ్ పై ఆమె మాట్లాడుతున్నంత సేపు అందరూ ఆసక్తిగా విన్నారు. టీడీపీ మహిళా నాయకుల ప్రసంగాలకు కూడా ఆ స్థాయి స్పందన రాలేదు. కానీ వెంకాయమ్మ అందరి దృష్టినీ ఆకర్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: