వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడుకు తలనొప్పులు తప్పేట్లు లేదు. పార్టీలోని పాత-కొత్త నేతలు, ఎంఎల్ఏలు-మాజీలకు, ఎంఎల్ఏలు-టికెట్లు ఆశిస్తున్నవారికి మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. విచిత్రం ఏమిటంటే ఒకేరకమైన గొడవలు రెండుపార్టీల్లోను కనబడుతున్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న గొడవలను చూసిన తర్వాత ఇద్దరికీ తలనొప్పులు తప్పవని అర్దమైపోతోంది.





తాజాగా మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి-మాజీమంత్రి పేర్నినాని మధ్య గొడవలు రోడ్డునపడ్డాయి. అలాగే మంత్రి విడదలరజనికి గుంటూరు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు మధ్య వివాదాలు పీక్స్ లో ఉన్నాయి. ఇలాంటి గొడవలే చీరాల, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్-ఎంఎల్ఏ జక్కంపూడి రాజాకు, నగరిలో మంత్రి రోజాకు బలమైన ప్రత్యర్ధివర్గం అన్నీ విషయాలోను చాలెంజ్ చేస్తోంది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ఎంఎల్ఏ రాచకొండ శివప్రసాదరెడ్డి-ఎంఎల్సీ రమేష్ యాదవ్, అనంతపురం జిల్లా హిందుపురంలో ఎంఎల్సీ మహమ్మద్ ఇక్బాల్-నవీన్ నిశ్చల్ మధ్య గొడవలు చాలాకాలంగా ఉన్నాయి.





ఇదే పద్దతిలో తెలుగుదేశంపార్టీలో కూడా కొందరు నేతలమధ్య గొడవలు పీక్స్ లో ఉన్నాయి. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో మాజీ ఎంఎల్ఏలకు, నియోజకవర్గాల ఇన్చార్జిలకు ఏమాత్రం పడటంలేదు. అలాగే అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ తో కనీసం ఏడు నియోజకవర్గాల్లోని మాజీ ఎంఎల్ఏలతో పడటంలేదు. కర్నూలులో ఆళ్ళగడ్డ, నంద్యాల, పాణ్యం, డోన్ నియోజకవర్గాల్లో నేతలమధ్య ఆధిపత్య గొడవలు తీవ్రంగా ఉన్నాయి.





చిత్తూరు జిల్లాలోని నగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని నేతల మధ్య వివాదాలు తీవ్రంగా ఉన్నాయి. ఇక ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని కొందరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఇదే పరిస్ధితి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలోనూ కనిపిస్తున్నాయి. మొత్తంమీద కొన్ని నియోజకవర్గాల్లో నేతలమధ్య గొడవలు రెండుపార్టీల్లోను ఉన్నది వాస్తవం. వచ్చే ఎన్నికలు ఇటు జగన్ అటు చంద్రబాబుకు కీలకమనే చెప్పాలి. పార్టీ అధికారంలోకి వస్తేనే తమకు భవిష్యత్తుంటుందని రెండుపార్టీల్లోని కొందరు నేతలు మరచిపోయారు. మరి ఈ పంచాయితీలను జగన్, చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: