వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలుపుసంగతి ఏమో కానీ ఇపుడైతే కొత్త తలనొప్పులు మొదలైపోయాయి. పాత-కొత్త ఇన్చార్జిల మధ్య నియోజకవర్గాల్లో వార్ మొదలైపోయింది. దాదాపు మూడేళ్ళు అసలు చాలా నియోజకవర్గాల్లో  సీనియర్ నేతలు కావచ్చు లేదా ఇన్చార్జిలు కావచ్చు ఎవరు కూడా పార్టీ బలోపేతానికి చేసిందేమీలేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకష్టమే అనే భావనలో ఉండేవారు కాబట్టి ఏదో మొక్కుబడిగా పార్టీలో నెట్టుకొస్తున్నారు.


సీన్ కట్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు మొదలుపెట్టిన బాదుడేబాదుడు కార్యక్రమంలో బాగా ఊపొచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఒంగోలులో నిర్వహించిన మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని చంద్రబాబు కూడా ఊహించని విధంగా జనాలు హాజరయ్యారని పార్టీలో, ఎల్లోమీడియాలో విపరీతమైన చర్చలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలని జనాలు డిసైడ్ అయిపోయారని అందుకనే తన కార్యక్రమాలకు జనాలు పోటెత్తుతున్నట్లు చంద్రబాబు కూడా చెప్పుకుంటున్నారు.


దాంతో ఒక్కసారిగా పాత కొత్తనేతల మధ్య కదలిక మొదలైంది. ఇపుడు ఇన్చార్జిలుగా ఉన్న కొత్తనేతలకు చెక్ పెట్టడానికి మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, ఇన్చార్జిలు యాక్టివ్ అవుతున్నారు. దాంతో ఇన్చార్జిలకు పాత నేతలకు మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయని టాక్. గుడివాడ, పెదకూరపాడు, చోడవరం, మాడుగుల, కందుకూరు, సత్తెనపల్లి, భీమిలి, యలమమంచిలి, మాడుగులతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇలాంటి వివాదాలు పెరిగిపోతున్నాయని సమాచారం. అధికారంలోకి వచ్చేస్తామనే నమ్మకం రావటంతోనే సీనియర్లు, మాజీలంతా యాక్టివైపోవటంతో సమస్యలు పెరిగిపోతున్నాయట.


హఠాత్తుగా మొదలైన ఇలాంటి వివాదాలను ఎలా పరిష్కరించాలనే విషయం చంద్రబాబుకు అర్ధం కావటంలేదు. ఒక్కోనియోజకవర్గంలో మూడు గ్రూపులు తయారయ్యాయట. వీటిలో ఏ గ్రూపు నేతకు టికెట్ ఇచ్చినా మిగిలిన నేతలు ఎన్నికల్లో  సహకరించరేమో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఇలాంటి నియోజకవర్గంలో రాష్ట్రమంతా కలిపి సుమారు 40 దాకా ఉంటాయట. ఇలాంటి వివాదాలే వైసీపీలో కూడా ఉన్నా అవి కొద్ది నియోజకవర్గాల్లో అనే చెప్పాలి. అధికారంలో ఉండటం, పార్టీపై పూర్తిస్ధాయి పట్టుండటం జగన్ కు కలిసొచ్చే అంశం. కానీ టీడీపీలో చంద్రబాబుకు పట్టు బాగా తగ్గిపోయింది కాబట్టే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చెలాయించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: