రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవంటారు. దేశ రాజకీయాల్లో ఈ విషయం ఎలాగున్నా వచ్చే ఎన్నికల్లో మన రాష్ట్రంలో మాత్రం నిరూపణవ్వబోతోంది. అదికూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనే రుజువవుతుందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. పవన్ పరిస్ధితి ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయలేరు అలాగని బీజేపీని వదిలించుకోలేరు. ఇదేసమయంలో టీడీపీతో పొత్తుకు బీజేపీ అగ్రనేతలను ఒప్పించలేక ఫెయిలయ్యారు.

పవన్ ప్రస్తుత పరిస్ధితికి తానే కారణమని చెప్పాలి. 2014-19 మధ్యకాలంలోనే ఏపీ ప్రయోజనాలను నరేంద్రమోడి సర్కార్ తుంగలో తొక్కేస్తున్నట్లు స్పష్టంగా బయటపడింది. జనాలందరికీ తెలిసిన ఈ విషయం పవన్ కు తెలీకపోవటమే విచిత్రంగా ఉంది. 2014-19 మధ్య ఏపీ ప్రయోజనాలను మోడి దెబ్బకొట్టారన్న మంటతోనే 2019 ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేయలేదు. బీజేపీకి 0.56 ఓట్లొస్తే నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్)కి వచ్చిన ఓట్లశాతం 3 అంటేనే బీజేపీపై జనాల్లో ఎంత మంటుందో అందరికీ అర్ధమైపోయింది.

2019 ఎన్నికలు అయిపోగానే పవన్ ఎగురుకుంటు వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. తాను బీజేపీతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏదోరూపంలో ఇబ్బందులు పెట్టవచ్చని అనుకున్నట్లున్నారు. కానీ పవన్ లాంటివాళ్ళని నరేంద్రమోడి, అమిత్ షా కొన్ని వందలమందిని చూసేసున్నారు. అందుకనే వాళ్ళముందు పవన్ ఆటలు సాగలేదు. అప్పుడు బీజేపీతో పెట్టుకున్న పొత్తు పాపమే పవన్ను ఇప్పుడు వెంటాడుతోంది. పవన్ తో పొత్తు వద్దని బీజేపీ అనుకుంటే తప్ప తనంతటా తానుగా బీజేపీకి దూరం జరగలేరు. బీజేపీతో ఉన్నంతకాలం చంద్రబాబునాయుడుకు దగ్గరకాలేరు. 
ఒకవేళ పవన్ పొత్తును తెగతెంపులు చేసుకుంటే బీజేపీ చూస్తు ఊరుకోదు. ఇటు పవన్ అటు చంద్రబాబు ఇద్దరినీ చెండాడుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీని ధిక్కరించిన వారి పరిస్ధితేమిటో పవన్, చంద్రబాబు చూస్తున్నారు. మోడిని ఎదిరించే ధైర్యంలేకే కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు  ఏ విషయంలో కూడా నోరెత్తటంలేదు. అప్పట్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా పార్టీ బలోపేతం మీదే దృష్టిపెట్టుంటే ఈ పాటికి టీడీపీ, బీజేపీలు పొత్తుల కోసం పవన్ వెంటపడుతుండేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: