ఇటీవల శ్రీలంక ఆర్థిక సంక్షోభం అక్కడి ప్రజల్ని ఎలా అవస్థలకు గురి చేసిందో చూస్తూనే ఉన్నాం. పెట్రోల్ కోసం క్యూలైన్లో నిలబడి 10మంది చనిపోయారనే వార్తలు కూడా కలవరపెడుతున్నాయి. ఆకలికి మలమల మాడి మరింత మంది చనిపోయారు. దొంగతనాలు, లూటీలు నిత్యకృత్యంగా మారాయి. ఈ బాధలు భరించలేక చాలామంది దొంగచాటుగా భారత్ కి వలస వచ్చి శరణార్థులుగా ఇక్కడ బతికిపోతున్నారు. మరికొంతమంది సముద్ర ప్రయాణంలోనే చనిపోతున్నారు. ఇంత జరుగుతున్నా శ్రీలంక ప్రభుత్వంలో మనుషులు మారారే కానీ, పద్ధతులు మారలేదు, ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు లేదు. ఇప్పుడు శ్రీలంక బాటలోనే పాకిస్తాన్ కూడా అవస్థలు పడుతోంది.

పాకిస్తాన్‌ లో కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభం ముసురుకుంటోంది. పాకిస్తాన్ లో ఇప్పటికే అన్ని రకాల నిత్యావసరాల వస్తువుల రేట్లు భారీగా పెరిగాయి. పాలు, చక్కెర, టీ పొడి, కూరగాయలు.. అన్నిటి రేట్లు భారీగా పెరిగాయి. ఇటీవలే ఇంధన రేట్లు కూడా ఆకాశాన్నంటాయి. దీనికి కారణం దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడమే. ఇప్పుడు పాకిస్తాన్ కి మరో చిక్కొచ్చిపడింది. అక్కడ కాగితానికి కరువొచ్చింది. కాగితం కొరత కారణంగా కొత్త విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాలను కూడా ముద్రించలేమని చేతులెత్తేశారు. పాకిస్తాన్ పేపర్ అసోసియేషన్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగితం సంక్షోభానికి ప్రపంచ ద్రవ్యోల్బణం కూడా కారణం. అయితే పాకిస్తాన్ విషయానికొస్తే.. అక్కడి ప్రభుత్వ విధానాల వల్ల స్థానిక పేపర్ పరిశ్రమల గుత్తాధిపత్యం పెరిగిపోయింది, ఇప్పుడు సమస్య ముదిరిపోయింది.

ఇటీవల శ్రీలంకలో కూడా పేపర్ కొరత కారణంగా విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు ఇవ్వలేకపోయారు, దానివల్ల పరీక్షలు రద్దు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఇలాంటి సంక్షోభమే వచ్చింది. దీంతో పేపర్ లేని కారణంగా పుస్తకాలు ముద్రించలేమని చెబుతున్నారు ఆల్ పాకిస్థాన్ పేపర్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు. పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పేపర్‌ సంక్షోభం కారణంగా ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం కోసం పుస్తకాలు ముద్రించలేమని వారు చెబుతున్నారు. పాకిస్తాన్ లో తీవ్రమైన పేపర్ సంక్షోభం ఉందని, పేపర్ ధరలు రోజు రోజుకీ భారీగా పెరిగిపోతున్నాయని చెప్పారు. పేపర్ చాలా ఖరీదైన వస్తువుగా మారుతోందని, అందువల్లే పుస్తకాలు ముద్రించలేకపోతున్నామని, ఒకవేళ ముద్రించినా వాటిని కొనే స్థోమత సాధారణ ప్రజలకు ఉండదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: