మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడినట్లే అనిపిస్తోంది. సంక్షోభానికి సంబంధించిన కీలక పరిణామాలు ఢిల్లీలో మొదలవుతుండటంతో ఆయువు తీరిపోయే రోజు దగ్గరలోనే ఉన్నట్లు అనుమానంగా ఉంది. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చేయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని శివసేన అధినేత, సీఎం ఉథ్థవ్ థాక్రే ప్రయత్నిస్తున్నారు.






ఒక నాణేనికి రెండువైపులా ఉన్నట్లు సంక్షోభంలో అందరికీ ప్లస్సులు, మైనస్సులు ఉన్నాయి. థాక్రేపై తిరుగుబాటు లేవదీసినంత మాత్రాన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేకి జరిగే లాభమేమీ పెద్దగా కనబడటంలేదు. అలాగే సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేసినంత మాత్రాన బీజేపీకి వచ్చే లాభమూ కనబడటంలేదు. ఇదే సందర్భంలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు థాక్రే చేస్తన్న ప్రయత్నాల వల్ల ఉపయోగముంటుందని ఎవరు అనుకోవటంలేదు.






288 సభ్యుల అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే 145 మంది ఎంఎల్ఏలు అవసరం. ప్రస్తుత సంకీర్ణానికి 169 మంది ఎంఎల్ఏలున్నారు. వీరిలో 40 మంది తిరుగుబాటు వల్ల ప్రభుత్వం కూలిపోతుంది. అయితే 106 మంది ఎంఎల్ఏలున్న బీజేపీ 40 మంది రెబల్ ఎంఎల్ఏలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. అయితే థాక్రేపై తిరుగుబాటు చేసిన ఎంఎల్ఏలు డిమాండ్లు నెరవేరకపోతే బీజేపీపైన తిరగబడలేరా ?





తిరుగుబాటు ఎంఎల్ఏలను నమ్ముకుని బీజేపీ ఎంతకాలం అధికారంలో ఉండగలదు ? ఇదే సమయంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న థాక్రే ప్రయత్నాలు ఫలించేట్లు కనబడటంలేదు. బీజేపీ గానీ తిరుగుబాటు ఎంఎల్ఏలు కానీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం. అంతా బాగానే ఉందికాని థాక్రేపై తిరుగుబాటు లేవదీసిన ఏక్ నాథ్ షిండే చివరకు సాధించేదేముంటుంది ? ఇటు థాక్రే ప్రభుత్వం కూలిపోయి అటు బీజేపీ ప్రభుత్వమూ ఎక్కువరోజులుండలేందు. అంటే రెండు ప్రభుత్వాలు కూలిపోవటానికి ప్రధాన కారకుడనే అపఖ్యాతి మూటకట్టుకోవటం తప్ప షిండే సాధించేదేమీ ఉండదు. అంతాబాగానే ఉంది సరే మరి రేపటి ఎన్నికల్లో షిండేతో పాటు తిరుగుబాటులో మద్దతుగా నిలబడిన ఎంఎల్ఏల భవిష్యత్తేంటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: