కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక విషయం చెప్పారు. అదేమిటంటే తొందరలోనే యావత్ దేశం తమ పార్టీ ఏలుబడిలోకి వచ్చేస్తుందట. ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కేరళ, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాల్లో కూడా బీజేపీ పవర్లోకి వచ్చేస్తుందన్నారు. కర్నాటకలో ఇప్పటికే అధికారంలో ఉందన్న విషయం తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తెలంగాణాలో అధికారంలోకి వచ్చేసినేట్లే అనుకుంటున్నారు.





సరే అమిత్ మాటలను పక్కనపెట్టేస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. కర్నాటకలో ఇతర ప్రభుత్వాలను కూల్చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. డైరెక్టుగా ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి రావటం ఒక పద్దతి అయితే ఇతర పార్టీల్లోని ఎంఎల్ఏలను లాగేసుకుని ఆ ప్రభుత్వాలను కూల్చేసి తాము అధికారంలోకి వచ్చేయటం మరోపద్దతి. దురదృష్టవశాత్తు బీజేపీ రెండోపద్దతిని ఎంచుకుంది. సరే ఇది కూడా వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగమే అనేది కమలనాదుల ఆలోచన కాబట్టి మనం చేయగలిగేదేమీలేదు.





ఇక తెలంగాణాలో కూడా అధికారంలోకి రావటం దాదాపు సాధ్యంకాదనే చెప్పాలి. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులు లేరు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందంటే ఎవరు నమ్ముతారు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే మిగిలిన ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిస్సాల్లో అధికారంలోకి రావటం కలలో మాత్రమే సాధ్యమవుతుంది. ఒడిస్సాలో ఏదో కాస్త బలమున్నా మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ బలం సున్నా.

దక్షిణాదిలో కర్నాటకలో తప్ప ఇంకెక్కడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. 





అసలు వచ్చే ఎన్నికల్లో కర్నాటకలో మళ్ళీ బీజేపీ గెలిస్తే అదే చాలా ఎక్కువన్నట్లుగా ఉందక్కడ పరిస్ధితి. ఉత్తరాధి, ఈసాన్య రాష్ట్రాలతో పాటు గోవాలో కూడా ప్రత్యర్ధిపార్టీల ఎంఎల్ఏలను లోబరుచుకునే అధికారంలోకి వచ్చింది. ఆమధ్య జరిగిన పాండిచ్చేరి ఎన్నికల్లో ఇలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి వచ్చింది. అంటే అధికారంలోకి రావటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కానీ ఏ పద్దతిలో వచ్చామా అన్నది అనవసరం.



మరింత సమాచారం తెలుసుకోండి: