ప్రధాని నరేంద్రమోదీని సోషల్ మీడియాలో ఆటాడేసుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ టీమ్. మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా #జుమ్లాకింగ్‌మోదీ అనే హ్యాష్ ట్యాగ్ ని బాగా పాపులర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్  ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు టీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు.

హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, తదనంతరం జరిగిన విజయ సంకల్ప సభ సమయంలో ఈ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండింగ్ లో ఉంది. సభలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ప్రసంగం పూర్తయ్యే వరకు ఈ హ్యాష్‌ ట్యాగ్‌ పొలిటికల్‌ ట్రెండింగ్‌ గా నెంబర్-1 గా నిలిచింది. ప్రధాని మోదీ ఓ జుమ్లా కింగ్‌ అంటూ ఆయన ప్రసంగాన్ని విమర్శించారు. మాతాశిశు సంరక్షణ పథకం కోసం కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సోషల్ మీడియాలో విమర్శించారు. అందుకే మోదీ జుమ్లా కింగ్ అయ్యారని అన్నారు.

మోదీ అధికారంలోకి వచ్చాక ఆకలి సూచీలో 63వ ర్యాంక్‌ లో ఉన్న భారత్.. 101 స్థానానికి పడిపోయిందని, అందుకే ఆయన్ను జుమ్లా కింగ్ అనాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. గత ఎనిమిదేళ్లుగా భారత దేశంలో లివింగ్‌ కాస్ట్‌ పెరిగిందని, అదే సమయంలో కొనుగోలు శక్తి తగ్గిందని నెటిజన్లు వివరించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా ప్రాజెక్ట్ లు ఫెయిలయ్యాయని విమర్శించారు. స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీ, ఉమెన్‌ సేఫ్టీ.. ఇలా దేనిలోనూ మోదీ ప్రభుత్వం సరైన విజయాలను నమోదు చేయలేదన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక భారత్ లో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు.

ఇక తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ఇన్‌ హైదరాబాద్‌, మెడికల్‌ కాలేజీలు, నీతి ఆయోగ్‌ రికమెండేషన్స్‌ కూడా అమలు చేయలేదన్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్లు ఇవ్వలేదని, కాజీపేట రైల్వే కోచ్‌ కర్మాగారంపై కూడా మాట దాటవేశారని విమర్శించారు. ఇలా మోదీ ప్రసంగం మొదలై.. పూర్తయ్యేలోపు.. ఆయన ప్రసంగంపై వేలకొద్దీ హ్యాష్ ట్యాగ్ లు పడిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: