ఇది చాలా విచిత్రమైన విషయం. ప్రభుత్వాన్ని గబ్బుపట్టిద్దామనే ఆలోచనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనవాణి అనే కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఐదు వారాలపాటు జరుగుతుంది. వివిధ సమస్యలపై  ప్రజలనుండి తీసుకున్న అర్జీలను ప్రభుత్వ శాఖలకు పంపించి పరిష్కారమయ్యేట్లుగా తాను ఫాలోఅప్ చేస్తానని పవన్ ప్రకటించారు. అయితే ఇలాంటి కార్యక్రమంలోనే పవన్ కు ఊహించని షాక్ కొట్టింది.





ఇంతకీ ఏమి జరిగిందంటే కాపు రిజర్వేషన్లపై తన వైఖరి ఏమిటో చెప్పాలంటు కాపు, తెలగ, బలిజ ఐక్యవేదిక సూటిగా ప్రశ్నించింది.  2014 ఎన్నికల్లో కాపులకు బీసీ రిజర్వేషన్ వర్తింపచేస్తామనే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు మాట తప్పినపుడు మీరేం చేస్తున్నారంటు పవన్ను ఐక్యవేదిక నేతలు నిలదీయటంతో ఏమి సమాధానం చెప్పాలో దిక్కుతెలీలేదు. కాపు రిజర్వేషన్ల అంశంతో పాటు కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గాల సమస్యల పరిష్కారంపై బహిరంగ ప్రకటన చేయాలని ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు.





ఐక్యవేదిక నేతల డిమాండ్లకు ఎలా రెస్పాండ్ కావాలో పవన్ కు అర్ధంకాలేదు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు మాటతప్పినా ఎందుకు నిలదీయలేదో చెప్పాలన్న డిమాండుకు పవన్ మౌనమే సమాధానమైంది. కాపులను బీసీల్లోకి చేర్చే విషయమై బహిరంగ ప్రకటన చేయాలన్న డిమాండుతో పవన్ ఇబ్బందుల్లో పడినట్లే. ఎందుకంటే సరిగ్గా ఇదే విషయంలోనే చంద్రబాబుకు బీసీలు దూరమయ్యారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు వర్తింపచేయటాన్ని బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.





చివరకు రిజర్వేషన్లు వర్తింపచేయలేదన్న కోపంతో కాపులు, బీసీల రిజర్వేషన్లను కాపులకు షేర్ చేస్తున్నారంటు బీసీలు చంద్రబాబును 2019 ఎన్నికల్లో  వ్యతిరేకించారు. ఫలితంగానే టీడీపీకి 23 సీట్లు రావటం. ఇపుడు అదే డిమాండ్ పై స్పందించాలని కాపు ఐక్యవేదిక  డిమాండ్ చేయటంతో ఏమి సమాధానం చెప్పాలో పవన్ కు అర్ధంకాలేదు. ఏ ప్రకటన చేస్తే ఏ సామాజికవర్గం దూరమవుతుందో తెలీదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో పవన్ దాటవేయలేని అంశమిది. మొత్తానికి ఐక్యవేదిక నేతలు పవన్ కు పెద్ద షాకే ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: