‘ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే’ ఇది తాజాగా కర్నూలు జిల్లాలోని మంత్రాలయం ఇన్చార్జి తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటల్లో నైరాస్యం స్పష్టంగా కనబడుతోంది. పోయిన ఎన్నికల్లో గెలవటానికే చాలామంది ఆస్తులు తాకట్టుపెట్టారట. గడచిన మూడేళ్ళుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు పొలాలు, ఆస్తులను అమ్ముకుంటున్నట్లు చెప్పారు.






ఈ పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ అంటే ఉన్న ఆస్తులను కూడా అమ్మేసి టీ అమ్ముకుని బతకాల్సిందే అని చెప్పారు. తిక్కారెడ్డి వ్యాఖ్యలతో చాలామంది సీనియర్ నేతల పరిస్ధితి ఏమిటో అర్ధమవుతోంది. చాలామంది తమ పరిస్ధితిని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. కొందరు మాత్రం ఏదో సందర్భంలో బయటపడుతున్నారంతే.  ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలంటే డబ్బున్న వాళ్ళకే టికెట్లు అనే కాన్సెప్టును అమలు చేయాలని చంద్రబాబునాయుడు, లోకేష్ డిసైడ్ చేశారట.






ఎవరెంతచెప్పినా రాజకీయాల్లో డబ్బుపాత్ర చాలానే ఉంటుంది. అందులోను ఎన్నికల్లో పోటీచేయాలంటే కొత్తగా చెప్పాల్సిన అవసరమేలేదు. ఒక ఓసీ నియోజకవర్గంలో ఇద్దరు గట్టి అభ్యర్ధుల మధ్య పోటీ అంటే తక్కువలో తక్కువ చెరొకళ్ళు రు. 50 కోట్లు ఖర్చుపెట్టనిదే జరగదు. పోయిన ఎన్నికల్లోనే పార్టీనుండి నిధులందక చాలామంది టీడీపీ అభ్యర్ధులు తమ ఆస్తులను కుదవపెట్టుకున్నారనే ప్రచారముంది. పార్టీ ఓడిపోవటంతో చాలామంది మీద పెద్ద దెబ్బపడింది. అలాంటిది రేపటి ఎన్నికల్లో పోటీచేయాలంటేనే భయపడిపోతున్నారు.






ఈ విషయాన్నే తిక్కారెడ్డి బహిరంగంగా చెప్పారు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇంతింత డబ్బులు ఖర్చులుపెట్టుకున్నా టికెట్ దక్కేది కూడా డౌటేనట. చివరి నిముషంలో పొత్తుల పేరుతో తమకు టికెట్లు ఎగరగొట్టేస్తే తమ గతేమికానంటు తమ్ముళ్ళు గోలపెడుతున్నారు. అందుకనే డబ్బులు బాగా ఖర్చులు పెట్టుకునే స్తోమతున్న వాళ్ళకే టికెట్లలో ప్రాధాన్యతని లోకేష్ స్పష్టంగా చెబుతున్నట్లు పార్టీ నేతలంటున్నారు. అన్నేసి కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టిన తర్వాత పార్టీ అధికారంలోకి రాకపోతే తమ పరిస్ధితి ఏమిటో తమ్ముళ్ళకు అర్ధం కావటంలేదు. ఇందుకే తమకు ఆత్మహత్యలే గతని తిక్కారెడ్డి చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: