ప్రధాన ప్రతిపక్షాలు తెలుగుదేశంపార్టీ, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ వైఖరి రానురాను చాలా విచిత్రంగా మారిపోతోంది. విచిత్రంగా అంటే మరీ నేలబారుస్ధాయికి దిగజారిపోతోంది. రాజకీయంగా వీళ్ళద్దరు జగన్మోహన్ రెడ్డికి బద్ధ విరోధులు. కాబట్టి ముగ్గురు ఒకరిని మరొకరు ఏ స్ధాయిలో అయినా విమర్శించుకోవచ్చు. రాజకీయంగా జగన్ను మిగిలిన ఇద్దరు ఏస్ధాయిలో అయినా విబేధించుకోవచ్చు తప్పులేదు.






అయితే ఆ స్ధాయి దాటిపోయి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను, జనాలు మెచ్చుకుంటున్న వ్యవస్ధలను దారుణంగా విమర్శిస్తున్నారు. దీంతో జనాలకు ఒళ్ళు మండుతోంది. విషయం ఏమిటంటే అమ్మఒడి పథకం వేస్టని చంద్రబాబు అంటున్నారు. ఏదైనా పథకం అమలులో లోపాలుంటే ఎత్తిచూపటంలో తప్పులేదు. అంతేకానీ మెజారిటి ప్రజలకు అందుతున్న పథకాన్నే వేస్టంటే జనాలు ఎందుకు ఒప్పుకుంటారు.






అలాగే నాడు-నేడు పథకంలో వేలాది స్కూళ్ళు అద్బుతంగా బాగుపడుతున్నాయి. తమ ఊర్లలోని స్కూళ్ళకు పట్టిన మహర్దశను చూసి ఆ ఊరివాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. దశాబ్దాలుగా పాడుపడిపోయిన స్కూళ్ళకు వేలాది కోట్లరూపాయలు ఖర్చులు పెట్టి బాగుచేయిస్తున్నారు. ఈ పథకం అంతా అవినీతి మయమని చంద్రబాబు గోలచేస్తున్నారు. తన హయాంలో ఒక్క స్కూలును కూడా బాగుచేద్దామని ఆలోచించని చంద్రబాబు ఇపుడు గొంతుచించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.





ఇక పవన్ అయితే వాలంటీర్ల వ్యవస్ధే దండగన్నారు. వాలంటీర్లు మాఫియా లాగ తయారైనట్లు మండిపడ్డారు.  గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ల వల్ల ఇళ్ళల్లో ఆడవాళ్ళకు  భద్రతలేకుండా పోతోందని ఆరోపించిన విషయం తెలిసిందే. నిజానికి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధ పనితీరు విషయంలో చాలామంది జనాలు హ్యాపీగా ఉన్నారు. జనాలు హ్యాపీగా ఉన్న వ్యవస్ధలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, పవన్ కు జనాల్లో ఎంతమంది ఓట్లేస్తారు ? కాబట్టి వీళ్ళద్దరు పథకాలను, వ్యవస్ధల గురించి మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. జనాలు హ్యాపీగా ఉన్నపుడు వీళ్ళు కాదంటే  ఎవరూ ఒప్పుకోకపోగా వ్యతిరేకమవుతారు. దీనికన్నా పథకంలో లోటుపాట్లను ఎత్తిచూపితే బాగుంటుంది. కాబట్టి చంద్రబాబు, పవన్ తమ వైఖరిని మార్చుకోకపోతే నష్టపోయేదీ వాళ్ళే అన్న విషయం ఎన్నికల తర్వాత కానీ అర్ధకాదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: