భారత్ లో మంకీపాక్స్ హడలెత్తిస్తోంది. తొలి మరణం నమోదైంది. మంకీపాక్స్ తొలి కేసు నమోదైన కేరళలోనే తొలి మరణం కూడా సంభవించడం ఆందోళన కలిగించే అంశం. ఈ మరణంతో వైద్య వర్గాలు, ప్రజల్లో కూడా మరింత ఆందోళన పెరిగింది. కేరళలోని త్రిసూర్ జిల్లా పున్నియార్ లో 22 సంవత్సరాల యువకుడు మంకీపాక్స్ కారణంగా మృతి చెందాడు. ఇతను యూఏఈ నుంచి గత నెల భారత్ కు వచ్చాడు. అక్కడే మంకీపాక్స్ సోకింది. అయితే ఆ విషయాన్ని దాచి ఉంచాడని అంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎవరికీ మంకీపాక్స్ సోకినట్టు చెప్పలేదు. సాధారణ జ్వరం మినహా మంకీపాక్స్ లక్షణాలేవీ లేకపోవడంతో వైద్యులు కూడా ప్రత్యేక వైద్యం జోలికి వెళ్లలేదు. సాధారణ జ్వరానికి సంబంధించిన వైద్యం చేశారు. చివరకు ఈ వైరస్ ప్రభావంతో అతను చనిపోయాడు. తీరా ఇప్పుడు వైద్యులకు కుటుంబ సభ్యులు అసలు విషయం చెప్పారు. యూఏఈలోనే అతడికి మంకీపాక్స్ సోకిందని ఆ రిపోర్ట్స్ అందించారు.

కేరళ వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కేరళలో మంకీపాక్స్ తొలి మరణం నమోదైనట్టు తెలిపారు. యూఏఈ రిపోర్ట్ లను స్వాధీనం చేసుకున్న అధికారులు మృతుడి నుంచి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి పంపించారు. ఆ రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

అధికారులు అప్రమత్తం..
ప్రస్తుతానికి కేరళలో మూడు కేసులు బయటపడగా, ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. మొత్తం నాలుగు కేసులు అధికారికంగా భారత్ లో వెలుగు చూశాయి. ఇప్పుడు ఒక మరణం కూడా రికార్డ్ అయింది. తొలి కేసు వెలుగు చూసిన కేరళలోనే తొలి మరణం రికార్డ్ కావడం కూడా ఆందోళన కలిగించే అంశం. తెలంగాణలో రెండు అనుమానిత కేసులు వచ్చినా.. ఇంకా వ్యాధి నిర్థారణ కాలేదు. ఈలోగా ఇప్పుడు కేరళలో తొలి మరణం వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మంకీపాక్స్ విషయంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇటు భారత్ లో కూడా అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తత ప్రకటించారు. మంకీపాక్స్ లక్షణాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: