ఏదో అనుకుంటో ఇంకేదో అవుతోందనే పాటలాగ తయారవుతున్నట్లుంది కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద కోపంతో ఏకంగా పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజగోపాలరెడ్డి రాజీనామా చేశారు. ఇంకా బీజేపీలో చేరలేదు కానీ రాబోయే ఉపఎన్నికలో మునుగోడు నియోజకవర్గంలో ఆయనే పోటీచేయటం ఖాయమైపోయింది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే కాంగ్రెస్ కు రాజీనామా చేయగానే తనతో పాటు ముఖ్యమైన క్యాడర్ మొత్తం రాజీనామా చేసి తనతోనే వచ్చేస్తారని రాజగోపాల్అనుకున్నారు. అయితే మాజీ ఎంఎల్ఏ ఒకటనుకుంటే ఇంకేదో జరుగుతోంది. రాజగోపాల్ పార్టీకి రాజీనామా చేసి పదిరోజులు అయినా ఇంతవరకు ద్వితీయశ్రేణిలో చెప్పుకోదగ్గ నేతలెవరూ కాంగ్రెస్ కు రాజీనామాలు చేయలేదు. పైగా తాము కాంగ్రెస్ లోన ఉంటామని తెగేసిచెప్పేశారు. దాంతో వాళ్ళపై ఒత్తిడిపెంచి రాజీనామాలు చేయించి బీజేపీలో చేర్చుకోవాలని అనుకున్నారు.

అయితే రాజగోపాల్ ఒత్తిడికి తలొంచిన కొందరు కాంగ్రెస్ ఎంపీటీసీ, సర్పంచులు బీజేపీలో చేరకుండా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ పరిణామాన్ని రాజగోపాల్ ఏమాత్రం ఊహించలేదు. దాంతో మిగిలిన మద్దతుదారులను ఏ విధంగా మ్యానేజ్ చేయాలో అర్ధం కావటంలేదు. రాజగోపాల్ మద్దతుదారులను పార్టీలోనే నిలుపుకోవాలని ఒకవైపు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో మాజీ ఎంఎల్ఏ మద్దతుదారులు బీజేపీలోకి పోకుండా తమవైపు లాక్కునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్ ప్రయత్నాలను పక్కనపెట్టినా టీఆర్ఎస్ దెబ్బకు రాజగోపాల్లో టెన్షన్ పెరిగిపోతోందట. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందో లేదో తెలీని బీజేపీలో చేరటంకన్నా ఇపుడు టీఆర్ఎస్ లో చేరటమే మేలని క్యాడర్లోని బలమైన నేతలు అనుకుంటున్నారట. అందుకనే అనేకరకాలుగా అంచనాలు వేసుకుని ఏడుగురు నేతలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. మిగిలిన వారిని కూడా పార్టీలోకి చేర్చేసుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే అంతర్గతంగా టీఆర్ఎస్ లో అభ్యర్ధి విషయంలో గొడవలు నడుస్తున్నాయి. వీటిని న్యూట్రల్ చేయటానికైనా బయటనుండి నేతలను తెచ్చుకోవాలనేది కేసీయార్ వ్యూహంలాగుంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: