కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయిన గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్లో కొత్తగా పార్టీ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి అధికారంలోకి రావాలనేది ఆజాద్ ఆలోచన. అయితే తన ఆలోచన ఎంతవరకు వర్కవుటవుతుందో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇప్పటికే కాశ్మీర్లో చాలా పార్టీలున్నాయి. మిగిలిన పార్టీల అధినేతలందరు తమ పూర్తి కాలాన్ని కాశ్మీర్లోనే గడిపేస్తున్నారు. కానీ ఆజాద్ మాత్రం ఎక్కువభాగం ఢిల్లీలోనే గడిపేసి చివరి రోజుల్లో కాశ్మీర్ కు తిరిగెళ్ళారు.





చివరి రోజుల్లో అంటే ఇక్కడర్ధం రాజకీయంగా ఆజాద్ జీవితం క్లైమ్యాక్సుకు చేరుకున్నట్లే. ఆయన వయసు సుమారు 76 ఏళ్ళు. ఇంత లేటువయసులో కొత్తపార్టీ పెట్టి మైన్ టైన్  చేయటం, ప్రచారానికి తిరగటం, పోటీచేయటం అంటే మామూలు విషయంకాదు. సరే ఎన్నికలు వస్తేకానీ ఆజాద్ కొత్త పార్టీ ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ (డీఏపీ) జాతకం ఏమిటో తెలీదు. అయితే చాలామందిలోని అనుమానం ఏమిటంటే ఆజాద్ బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్నారా అని.





ఎందుకంటే దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఆకాశమేహద్దుగా అధికారాలను అనుభవించారు. ప్రభుత్వంలోను, పార్టీలోను ఎన్నో కీలకమైన పదవులను అనుభవించేసి ఇక కాంగ్రెస్ పార్టీలో అనుభవించటానికి ఏమీ అవకాశాలు లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత బండలు వేయటం మొదలుపెట్టారు. సోనియాగాంధీ, రాహుల్ పై ఆరోపణలు, విమర్శలు చేయటం, పార్టీని పలుచనచేస్తు కామెంట్లుచేయటం, సోనియాకు లేఖలు రాశారు. ఇదంతా కూడా కేవలం నరేంద్రమోడీ కోసమే ఆజాద్ చేశారనే ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.





అందుకనే ఆజాద్ బీజేపీ కోవర్టుగా పనిచేస్తున్నారంటు డైరెక్టుగానే చాలామంది నేతలు ఆరోపించారు. ఇక కాశ్మీర్ విషయానికి వస్తే ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరాలని మహా పట్టుదలగా ఉంది. అయితే పరిస్ధితులు అనుకూలంగా లేవు. ఓటర్లందరు లోకల్ పార్టీల మధ్యే చీలిపోయున్నారు. వీళ్ళతో పోరాడి ఓట్లు తెచ్చుకుని అధికారంలోకి రావటం బీజేపీకి కష్టమే. అందుకనే తన అవస్తలు ఏదో తాను పడుతునే ఓట్లలో చీలిక తేవటంకోసమే ఆజాద్ రూపంలో కొత్తపార్టీ పెట్టిస్తోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఎంతవరకు నిజమనేది కాలమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: