ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు నెత్తిన ఒక తమ్ముడు పెద్ద బండనే వేశారు. దీని పర్యవసానం ఎలాగుంటుందో చూడాలిమరి.  ఇంతకీ విషయం ఏమిటంటే మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతు టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామ, వార్డు సచివాలయాలన్నింటినీ రద్దు చేస్తామని ప్రకటించారు. సచివాలయాల స్ధానంలో జన్మభూమి కమిటీలను పునరుద్ధరిస్తామని చెప్పారు. సచివాలయాల వ్యవస్ధను రద్దుచేస జన్మభూమి కమిటీలను తీసుకురావాలని స్వయంగా తనతో చంద్రబాబే చెప్పారని కాలువ అన్నారు.

మరి కాలువ చెప్పిందాంట్లో ఎంత నిజముందో ఎవరికీ తెలీదు. ఎందుకంటే గ్రామ, వార్డు సచివాలయాలను రద్దుచేసి మళ్ళీ జన్మభూమి వ్యవస్ధను తీసుకొస్తామని ఇప్పటివరకు చంద్రబాబు బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. అవేమిటంటే గ్రామ, వార్డు సచివాలయాలు జనాల్లో బాగా చొచ్చుకుపోయాయి. చాలమంది జనాలు సచివాలయాల పనితీరుతో ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.

సచివాలయాల ఏర్పాటు కారణంగా జనాలు ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం తప్పింది. ఏదున్నా నేరుగా సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేస్తే అక్కడినుండి అంతా ఫాలోఅప్ అవుతోంది. కాబట్టి జనాలు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇంతటి జనాదరణ పొందిన సచివాలయాల వ్యవస్ధను రద్దుచేస్తామని కాలువ చెప్పటం జనాలకు రుచించటంలేదు. ఇదే సమయంలో జన్మభూమి కమిటీలను తీసుకొస్తామని చెప్పటం కూడా జనాలకు ఏమాత్రం రుచించటంలేదు.

ఎందుకంటే జన్మభూమి కమిటీలతో జనాలంతా నానా అవస్తలు పడేవారు. ఏ పని అవసరమైనా కమిటీలో సభ్యులకు డబ్బులు ఇచ్చుకోనిదే ఒక్కపని కూడా అయ్యేదికాదు. చివరకు టీడీపీ వాళ్ళకు అవసరమైనా డబ్బులిచ్చుకోవాల్సిందే. దాంతో కమిటీ సభ్యులపైన పార్టీలోనే తీవ్రస్ధాయిలో వ్యతిరేకత వచ్చేసింది. ఎన్నిసార్లు చంద్రబాబుకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవటంతో చివరకు అంతా కలిసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా పనిచేశారు. టీడీపీ ఘోరంగా ఓడిపోవటానికి జన్మభూమి కమిటీలపై జనాల్లో వ్యతిరేకత కూడా ఒక కారణం. అలాంటి వ్యవస్ధను మళ్ళీ చంద్రబాబు తీసుకొస్తారని కాలువ చెప్పటమంటే పెద్ద బండ వేసినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: