భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చూస్తే అందరికీ ఇదే విషయంపై క్లారిటి వచ్చేసింది. ఇంతకాలం తన ఒంటెత్తుపోకడలతో బీజేపీని ఇబ్బంది పెడుతున్న జనసేన పవన్ కల్యాణ్ మొదటిసారి షాక్ తిన్నారు. వైసీపీ, టీడీపీలకు సమానదూరం పాటించాలనే తీర్మానం చాలా కీలకమైనది. బహుశా ఈ తీర్మానం పవన్ కోసమే చేశారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. తమతో మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పొత్తులు పెట్టుకుంటానని పవన్ చేసిన ప్రకటనపై కమలనాదులు మండిపోతున్నారు.

బీజేపీతో కలిసుండటం పవన్ కు ఎంతమాత్రం ఇష్టంలేదని తెలుస్తునే ఉంది. ఇదే సమయంలో పవన్ తో కలిసి సాగటం కష్టమని బీజేపీకీ అర్ధమైపోయింది. అంటే రెండుపార్టీలు కూడా కలిసినడవాలని కోరుకోవటంలేదు. అయితే మరెందుకు విడిపోవటంలేదు ? ఎందుకంటే రెండుపార్టీల్లో కూడా దేనికదే ఎదుటిపార్టీ వల్లే పొత్తు విచ్ఛన్నమైందని నెపం వేసుకునేందుకు మాత్రమే వెయిట్ చేస్తున్నాయి. ఇపుడు విడిపోవటం పద్ద సమస్య కానేకాదు. అయితే వచ్చేఎన్నికల్లో ఎదుటిపార్టీపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి అవకాశం దొరుకుతుందని రెండుపార్టీలు ఎదురుచూస్తున్నాయి.

వైసీపీ, టీడీపీతో సమదూరం పాటించాలని బీజేపీ తీర్మానం చేసిందంటే ఇక పొత్తు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది పవనే. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి కేంద్ర నాయకత్వం ఆమోదం ఉంటుంది. లేదా కేంద్ర నాయకత్వం సూచన ప్రకారమే రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించుంటుందనటంలో సందేహంలేదు. ఏదేమైనా టీడీపీ విషయంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసేసింది.


కాబట్టి బీజేపీతో కంటిన్యు అయ్యే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ మాత్రమే. కమలనాదులతో ఉంటూనే టీడీపీతో కూడా చేతులు కలుపుతానని పవన్ అంటే కుదరదు. ఉంటే బీజేపీతో మాత్రమే ఉండాలి. లేదంటే బీజేపీని వదిలేసి చంద్రబాబునాయుడుతో వెళ్ళాలి. రెండింటిలో ఏది జరిగినా పవన్ కు షాక్ మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే తమను వదిలేసిన వాళ్ళని బీజేపీ ఊరికే వదిలిపెట్టదు. అలాగే తన దగ్గరకు వచ్చినంత మాత్రాన పవన్ను చంద్రబాబు నెత్తినా పెట్టుకోరు. మొత్తానికి పవన్ కు బీజేపీ గట్టి షాకిచ్చిందనే అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: