- బీసీ చేనేత‌, యాద‌వుల ఓట్లే టార్గెట్‌గా మంగ‌ళ‌గిరిలో పోటీ..
- బీసీ ఓట్లు చీలితే టీడీపీ యువ‌నేత లోకేష్ గెలుపు క‌ష్ట‌మే..
- టెన్ష‌న్‌లో టీడీపీ నాయ‌క‌త్వం...

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ(బీసీవై) స్థాపించిన బీసీ నాయ‌కుడు బోడే రామ‌చంద్ర‌యాద‌వ్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బీసీల గ‌ళాన్ని బ‌లంగా వినిపించి.. న్యాయం చేయాల‌ని, వారికి రాజ్యాధికారం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాల‌ని సంక‌ల్పిం చుకున్నారు. ఈ నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీలో ఉన్న బోడే... మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి స‌వాలుగా మారారు.


ఇక‌, ఇప్పుడు మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి బోడే పోటీకి రెడీ అవుతున్నారు. చేనేత కార్మికులు, యాద‌వులు ఎక్కువ‌గా ఉన్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో బోడే పోటీ చేయ‌నున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుత‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీవై పార్టీ తరపున 32 మంది అభ్యర్ధులను ప్ర‌క‌టించిన బోడే.. ఈ జాబితాలో మంగ‌ళ‌గిరి నుంచి త‌న పేరును పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ప‌రిరక్షణ, రైతులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోడే తెలిపారు.


పైగా మంగ‌ళ‌గిరిలో బీసీలు ఎక్కువ‌గా ఉన్నందున త‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్నది.. బోడే రామ‌చంద్ర యాద‌వ్ వ్యూహంగా ఉంది. ఒక అభ్య‌ర్థి ఎన్ని చోట్ల నుంచైనా పోటీ చేసేందుకు అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న పుంగ‌నూరు, మంగ‌ళ‌గిరిని ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. పుంగ‌నూరు ప‌రిస్థితి ఎలా ఉన్నా.. మంగ‌ళ‌గిరిలో బోడే అడుగు పెడితే.. అది ప్ర‌త్య‌క్షంగా.. ప‌రోక్షంగా టీడీపీకి ఇబ్బంది అవుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో లోకేష్‌తో పాటు టీడీపీ నాయ‌క‌త్వంలోనూ టెన్ష‌న్ అయితే స్టార్ట్ అయ్యింది. దీనిని టీడీపీ ఎలా స్వీక‌రిస్తుదో చూడాలి.


ఇక‌, పుంగనూరు విష‌యానికి వ‌స్తే... బ‌ల‌మైన పోటీ చేస్తున్నార‌నే చెప్పాలి. వాస్త‌వానికి పెద్దిరెడ్డి ఇక్క‌డ మాత్ర‌మే కాకుండా.. ఉమ్మ‌డి చిత్తూరులోని దాదాపు స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌ను తీసుకున్నా రు. వైసీపీని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిపించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, బోడే ఎంట్రీ స‌హా.. ఆయ‌న దూకుడు పెంచ‌డంతో ఇప్పుడు పెద్దిరెడ్డి కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యే ప‌రిస్థితిని క‌ల్పించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తానికి బోడే వ్యూహంతో రామ‌చంద్రారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: