తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాలు, ఆర్థిక, అంగ బలాలు బేరీజు వేసుకుని గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చింది. ఈ క్రమంలో పార్టీకి కంచుకోట లాంటి ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గానికి  ఆర్ రఘురామి రెడ్డి పేరును ఖరారు చేసింది. ఖమ్మం లోక్‌సభ స్థానం కోసం మంత్రుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో జాప్యం జరిగింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందిని, దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్‌రెడ్డికి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తనయుడు తుమ్మల యుగంధర్‌కు టికెట్ ఇవ్వాలని కోరారు. పార్టీ హైకమాండ్ చివరకు రఘురామ్ రెడ్డిని ఎంపిక చేసింది మరియు ప్రతిష్టంభనను ముగించడానికి మంత్రులందరి బంధువులందరికీ టికెట్ నిరాకరించింది. అయితే రఘురాంరెడ్డి మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సమీప బంధువు. ఆయన కుమార్తెను రఘురాంరెడ్డి రెండో కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇక ఈ కుటుంబానికి సినీ సంబంధాలు కూడా ఉన్నాయి. తెలుగు టాప్ హీరోతో రఘురాం రెడ్డికి సంబంధాలు ఉన్నాయి.


ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి కుటుంబానికి రాజకీయ, సినీ నేపథ్యం ఉంది. ఇక ఆయన కుటుంబం రాష్ట్రంలోని పలు చోట్ల దేవాలయాలను నిర్మించింది. రఘురాం రెడ్డి హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఆయన తండ్రి రామసహాయం సురేందర్‌రెడ్డి తొలి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. తెలంగాణలోని డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడు సార్లు, మహబూబాబాద్ నుంచి ఒకసారి ఆయన ఎంపీగా గెలిచారు.ఇలా ఆయనకు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఇక రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డికి, సినీ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తెకు ఆశ్రితకు వివాహం జరిగింది. ఆయన రెండో కుమారుడు అర్జున్ రెడ్డికి, మంత్రి పొంగులేటి కుమార్తె స్వప్నిరెడ్డికి వివాహం జరిగింది. ఇలా రాజకీయ, సినీ నేపథ్యం ఉన్న ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. దీంతో ఆయన తరుపున హీరో విక్టరీ వెంకటేష్ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: