ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లెక్కింపు తేదీ రోజే దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు ఏమైపోయాయో అని చాలా ఎమోషనల్ గా, ఇక కన్నీళ్లు పెట్టుకోవడమే తరువాయి అన్నట్లు మాట్లాడారు.

ఆయన ఇప్పుడు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలలో చాలా అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించలేదని, కానీ ఫలితాలు మాత్రమే నెగిటివ్‌గా వచ్చాయని తాజాగా జగన్ వైసీపీ అభ్యర్థుల ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తన క్యాంపు ఆఫీస్‌లో ఓటమి పాలైన వైసీపీ అభ్యర్థులను కలిశారు జగన్. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్‌కు ముందు, తరువాత ఏపీ వైడ్‌గా సర్వే చేయించామని, 17 లక్షల శాంపిల్స్‌ తీసుకుంటే తమదే గెలుపు అని తేలినట్లు ఆయన చెప్పారు.

మరి సర్వేలో ఇలా అనుకూల తీర్పు వస్తే అధికారిక ఎన్నికల ఫలితాల్లో ఎందుకు ప్రతికూల తీర్పు వచ్చింది? దీని గురించి ఏపీలో ఇప్పటికీ పెద్ద చర్చ నడుస్తోంది. చాలామంది చంద్రబాబు మోదీతో కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించారని ఆరోపణలు చేస్తున్నారు. రాయలసీమతో పాటు వైసీపీకి కంచుకోటలా ఉన్న ప్రాంతాలలో వైసీపీ అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవిచూశారు. చరిత్రలో ఎప్పుడూ వైసీపీ గెలిచే చోట ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు గెలిచారు. అది కూడా ఊహించని మెజారిటీలతో! ఇది ఎలా సాధ్యం, జనాలు నిజంగానే వైసీపీ వాళ్లపై ఇంత వ్యతిరేకత పెంచుకున్నారా? పోయినసారి పవన్ కళ్యాణ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన ప్రజలే ఈరోజు కొన్ని వేల మెజారిటీతో ఎందుకు గెలిపించారు? ఆయనేం చేశారని, ఆయనపై ఎందుకు అంత నమ్మకం పెరిగింది? అనేది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలింది.

బీజేపీ, జనసేన, కూటమి కలవడం వల్లే జగన్ ఓడిపోవాల్సి వచ్చిందని మరికొంతమంది అంటున్నారు. పవన్ ఏదో చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారని, అందుకే ఓట్లు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి కొంతమంది మాత్రం జగన్ సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్ప ఏపీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, అందుకే ఆయనను ఓటర్లు వద్దనుకొని ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: