ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 175 సీట్లకుగానూ ఏకంగా 164 సీట్లను సాధించి అసెంబ్లీలో కూటమి అడుగు పెట్టబోతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, క్యాబినెట్ మంత్రులు ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ కూర్పు విషయంలో చంద్రబాబు చాలా కసరత్తులు పాటించినట్లు తెలుస్తోంది. అయితే గత సంప్రదాయాలను చాలా వరకు చంద్రబాబు పక్కనపెట్టినట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుత క్యాబినెట్‌లో ఎక్కువ శాతం యువతకు పెద్ద పీట వేశారు. 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. 24 మంది మంత్రుల జాబితాలో జనసేన పార్టీకి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒకరు ఉన్నారు. మిగిలిన మంత్రులంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. విశేషమేమిటంటే ఏపీలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కోటా నుంచి ఓ ముస్లిం మంత్రి కూడా చేరారు. అయితే 1983 నుంచి అనుసరిస్తున్న ఓ సంప్రదాయాన్ని ప్రస్తుతం చంద్రబాబు పక్కన పెట్టాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

తూర్పు ఎటు వైపు అయితే తీర్పు అటు వైపు అనే సామెత ఉంది. ఏపీ రాజకీయాల్లో ఇది చాలా సార్లు నిరూపితం అయింది. గోదావరి జిల్లా ప్రజలు ఏ పార్టీకి ఆధిక్యం ఇస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వస్తుంది. 2009 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. అయితే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆ సంఖ్య 19కి తగ్గింది. అయినప్పటికీ అత్యధిక నియోజకవర్గాల జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో ఉంది. ఈ జిల్లాకు అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండడంతో మంత్రి పదవులు కూడా 4కు తగ్గకుండా ఇస్తూ రావడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం దానికి బ్రేక్ పడింది.


 ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలోని రాజమండ్రి జిల్లాలో భాగమైన నిడదవోలు నుంచి జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ సైతం మంత్రి పదవి చేపట్టారు. ఇలా చూస్తే కేవలం 3 మంత్రి పదవులు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు 4 మంత్రులు ఈ జిల్లా నుంచి ఉండేవారు. కూటమి తరుపున 164 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కడం కష్టమైంది. ఆ కారణంగానే చంద్రబాబు సైతం గత సంప్రదాయాలను పక్కన పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: