- గ్రామస్థాయి నుంచి రాష్ట్ర మంత్రిగా..
- పేట ప్రజల 62 ఏళ్ల కల నెరవేరిందా.?
- అసెంబ్లీలో ఈమె గళం హైలెట్ కానుందా.?

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే తరుణంలో రాష్ట్ర మంత్రివర్గ కూర్పు కూడా పూర్తయిపోయింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు ఆయన మంత్రివర్గంలో చేరారు. ఇందులో ముగ్గురు మహిళ  ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు టిడిపి అధినాయకులు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  వంగలపూడి అనిత. మరి ఈమె ఎవరు? ఈ  స్థాయికి రావడానికి ఎంత కష్టం పడింది. ఆమె ముందున్న సవాళ్లు ఏంటి అనేది చూద్దాం.

 వంగలపూడి అనిత అనే నేను :
మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లాలోని ఎస్ రామవరం మండలం లింగరాజుపాలెం గ్రామంలో పుట్టింది. అనిత 2009లోనే ఏయూ దూరవిద్య నుంచి ఎండి కోర్సును పూర్తి చేసింది. తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందిన అనిత  కొన్నాళ్లపాటు ఉద్యోగం చేసి 28 ఏళ్ల వయసులోనే ఉద్యోగానికి రాజీనామా చేసింది. తర్వాత 2012లో గ్రామస్థాయి రాజకీయాలను మొదలుపెట్టిన ఈమె  టిడిపిలో క్రియాశీలకమైన నేతగా ఎదిగింది. ఆ తర్వాత టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా  ఎన్నికై రాష్ట్రస్థాయిలో మంచి పేరు సంపాదించుకుంది అనిత.  అప్పటినుంచి పేదల సమస్యలపై గట్టిగా గళం వినిపిస్తూ వచ్చింది. ఆమె టాలెంటును గుర్తించినటువంటి టిడిపి అధిష్టానం  2014 పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి టికెట్ అందించారు.  దీంతో అక్కడ పోటీ చేసిన ఆమె వైసిపి క్యాండిడేట్ చెంగల వెంకటరావుపై 2080 ఓట్ల తేడాతో గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తానేటి వనిత చేతిలో 25వేల ఓట్ల తేడాతో ఓడింది. మొదటిసారి 2014లో అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు అనిత సంచలనాలకు తెరలేపిందని చెప్పవచ్చు. 


 2017లో అసెంబ్లీలో అనిత మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మధ్య విపరీతమైనటువంటి  వాగ్వాదం ఏర్పడింది. ఈ క్రమంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శృతిమించి మాటలు మాట్లాడింది. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయినటువంటి అనిత  ఆమెను సస్పెండ్ చేయాలంటూ అప్పటి  స్పీకర్ కోడెల శివప్రసాద్ కి ఫిర్యాదు చేసింది.  ఇది పరిశీలించినటువంటి స్పీకర్ రోజాను సంవత్సరం పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఈ విధంగా అసెంబ్లీలో తన గళాన్ని వినిపిస్తూ ముందుకు సాగుతున్న అనిత  2024 ఎన్నికల్లో  పాయకరావుపేట నుంచి మరోసారి విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు మహిళ ఎస్సి విభాగం నుంచి మంత్రి పదవి అందించారు టిడిపి అధినాయకుడు చంద్రబాబు నాయుడు. వాస్తవానికి 62 ఏళ్ల తర్వాత  ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చింది.  దీంతో ఆ నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఇదే క్రమంలో అనిత కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా అసెంబ్లీలో సమస్యలపై విపరీతంగా గళం వినిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆమె ఉపాధ్యాయురాలు కాబట్టి ఉద్యోగుల సమస్యలపై  ఆమె ప్రధానంగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎస్సీ వర్గాల వారి గురించి తన గళాన్ని అసెంబ్లీలో వినిపించే అవకాశం ఎక్కువగా ఉంది.  ఈ విధంగా అనిత అసెంబ్లీలో రాణి రుద్రమలా  సమస్యలపై పోరాటం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకు వెళుతుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: