- రేసులో పొన్నూరు ఎమ్మెల్యే న‌రేంద్ర‌
- ఆరుసార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి ప‌ద‌వి లేదు
- మంత్రి ప‌ద‌వికి బ‌దులుగా పార్టీ ప‌ద‌వితో గౌర‌విస్తారా..!

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో టీడీపీ ప్ర‌స్తుత రాష్ట్ర చీఫ్‌గా ఉన్న అచ్చెన్నాయుడును మ‌రోసారి మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. ఆయ‌న‌కు మ‌ళ్లీ కార్మిక శాఖే ఇస్తార‌నే టాక్ వినిపిస్తోంది. కానీ, ఆయ‌న గ‌తంలో ప్ర‌తిజ్ఞ చేసిన‌ట్టు తాను హోం శాఖ అడుగుతున్న‌ట్టు స‌మాచారం. కానీ, చంద్ర‌బాబు ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం రెండు ప‌డ‌వ‌ల‌పై.. అచ్చెన్న కాళ్లు మోప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.


ఎందుకంటే.. భారీగా పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్య నేప‌థ్యంలో మంత్రుల సంఖ్య ప‌రిమితంగా ఉంది. దీంతో మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారిని సంతృప్తి ప‌ర‌చాల్సి ఉంది. దీంతో ఒక్క‌రికి ఒక్క ప‌ద‌విఅనే నినాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అచ్చెన్న మంత్రి అయ్యారు కాబ‌ట్టి.. ఆయ‌న చూస్తున్న రాష్ట్ర టీడీపీ చీఫ్ ప‌ద‌విని వేరే వారికి ఇచ్చే అవ‌కాశం ఉంది. గ‌తంలో క‌ళా వెంక‌ట్రావు మంత్రిగా ఉంటూనే.. రాష్ట్ర టీడీపీ బాధ్య‌త‌లు చూశారు.


ఈ క్ర‌మంలో పార్టీ 2019లో ఓడిపోయింది. దీనికి కార‌ణం.. అటు మంత్రిగా, ఇటు పార్టీ బాధ్య‌త‌ల ప‌రంగా క‌ళా వెంక‌ట్రావు న్యాయం చేయలేక‌పోయార‌నే వాద‌న పార్టీలోనూ వినిపించింది.ఇప్పుడు కూడా .. ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తే అవ‌కాశం ఉంది. దీంతో అచ్చెన్న ప‌ద‌విని వేరే వారికి అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ జాబితాలో మ‌ళ్లీ కళా వెంక‌ట్రావే ఉంటార‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఉత్త‌రాంధ్ర‌కు ప్రాధాన్యం ఇస్తున్న నేప‌థ్యంలో క‌ళాకు అవ‌కాశం ఉంటుంద‌ని  తెలుస్తోంది.


ఒక‌వేళ క‌ళాను కాదంటే.. గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ మోస్ట్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్రకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం ఉంది. ఇది ఉభ‌య కుశ‌లోప‌రిగా ప‌నిచేస్తుంద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఆయ‌న కు ఎలానూ మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో క‌నీసం రాష్ట్ర పార్టీ ప‌గ్గాలు అయినా.. ఇస్తే.. స‌ముచితంగా గౌరవించిన‌ట్టు అవుతుంద‌ని తెలుస్తోంది. ఏదైమైనా .. మ‌రో నెల రోజుల్లో రాష్ట్ర టీడీపీ చీఫ్ ప‌ద‌విని కొత్త నేత స్వీక‌రించ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: