అధికారంలో ఉన్న వారు.. కొన్ని త‌ప్పులు చేస్తారు. ఇది స‌హ‌జం. అందుకే ప్ర‌భుత్వంలో ఎంత మంచి ప‌నులు చేసిన పార్టీకైనా.. ఎన్నిక ల‌స‌మ‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం యాంటీ పెరుగుతుంది. దీంతో ఓట్లు కూడా చీలిక వ‌స్తుంది. ఏపీ విష‌యానికి వ‌స్తే..తాజాగా అడ్ర‌స్ గ‌ల్లంతైన వైసీపీ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. అనేక త‌ప్పులు క‌నిపిస్తున్నాయి. పైకి ఏమీ లేవ‌ని పార్టీ అధినేత‌, ఇత‌ర నాయ‌కులు చెప్పుకొంటున్నా.. వారికి కూడా.. క్షేత్ర‌స్థాయిలో ఉన్న వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మైన త‌ప్పులు తెలుసు.


అయితే. ఎన్ని త‌ప్పులు చేసినా.. ఎన్ని హామీలు తుంగ‌లొ తొక్కి అమ‌లు చేయ‌క‌పోయినా.. అత్యంత కీల‌క మైన విష‌యంలో చేసిన త‌ప్పు కార‌ణంగా.. వైసీపీని ఓడించి తీరాల‌న్న క‌సి ప్ర‌జ‌ల్లో ర‌గిలింది. పైకి ఎవ‌రూ చెప్ప‌క‌పోయినా.. క్షేత్ర‌స్తాయిలో మాత్రం క‌నిపిస్తున్న వాస్త‌వం. అదే.. అమ‌రావ‌తి రాజ‌ధాని. ఇక్క‌డ రాజ‌ధానిని క‌ట్ట‌డం మానేసి.. రాష్ట్రానికి ఒక రాజ‌ధాని లేకుండా చేయ‌డం ప్ర‌ధ‌మ త‌ప్పు అయితే.. దీనికి అనుబంధంగా సాగిన త‌ప్పులు వైసీపీకి ప్రాణ సంక‌టంగా మారాయి.


నిజానికి అమ‌రావ‌తిని కొన‌సాగించి ఉంటే.. కొన్ని కొన్ని ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ అమ‌లు చేయ‌డం మానేసినా.. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకొనేందుకు.. స‌మ‌ర్థించుకునేందుకు కూడా అవ‌కాశం ఉండేది ప్ర‌జ‌లు కూడా వాటిని హ‌ర్షించేవారు. కానీ, ఇక్క‌డ అమ‌రాతిని పూర్తిగా అట‌కెక్కించ‌డం.. జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఏపీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవ‌డం కీల‌క త‌ప్పుగా మారింది. దీనికి అనుబంధంగా.. ఇక్క‌డ భూములు ఇచ్చిన రైతుల‌ను వేధించ‌డం.. కొట్టించ‌డం.. మ‌హిళ‌ల‌పైనా దౌర్జ‌న్యం చేయ‌డం వంటివి మ‌రింతగా క‌సి పెంచాయి.


ఇదే స‌మ‌యంలో అమ‌రావ‌తిని క‌మ్మ సామాజిక వ‌ర్గానికి అంట‌గ‌ట్టిన ద‌రిమిలా.. చంద్ర‌బాబును అరెస్టు చేయించ‌డంతో క‌మ్మ సామాజిక వ‌ర్గంలో ఏకీకృత శ‌క్తిని జ‌గ‌నే ప‌రోక్షంగా క‌దిలించారు. ఇదే.. ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేదు.. ఏపీకి వెళ్లి ఓటేయాల‌న్న క‌సిని పెంచింది. అంటే.. ఒక్క అమ‌రావ‌తిని విష‌యంలో చేసిన త‌ప్పు  కార‌ణంగా.. దీనికి అనుబంధంగా రైతుల‌ను వేధించ‌డం.. చంద్ర‌బాబును అరెస్టు చేయించ‌డం. వంటివి చోటు చేసుకుని.. వైసీపీ పుట్టి ముంచేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: