ఓట‌మి ఎవ‌రికైనా భార‌మే. మొహం చూపించ‌లేని ప‌రిస్థితి నెల‌కొంటుంది. అందునా.. ప్ర‌జ‌ల‌కు ఎన్నో ఇచ్చాం.. ఎంతో చేశామ‌ని చెప్పుకొన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఎన్నిక‌ల‌పై భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. మూడు రాజ‌ధానుల‌తో మూడు ప్రాంతాల‌ను అభివృద్ది చేస్తామ‌ని చెప్ప‌డం.. పార్టీ ప‌ద‌వులు.. ఎమ్మెల్సీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు .. నామినేటెడ్ ప‌ద‌వులు ఇలా.. అన్నింటిలోనూ ఆయ‌న సోష‌ల్ ఇంజ‌నీరింగుకు ప్రాధాన్యం ఇచ్చిన దరిమిలా.. గెలుపు ఖాయ‌మ‌ని రాసిపెట్టుకున్నారు.


కానీ, జ‌గ‌న్ ఒక‌టి త‌లిస్తే.. జ‌నాలు మ‌రొక‌టి చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో 11 స్థానాల‌కే ఆయ‌న‌ను ప‌రిమితం చేశారు. దీంతో స‌హ‌జంగానే మొహం ఎత్తుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది. అయిన‌ప్పటికీ.. పార్టీని బ‌లంగా చూసుకోవాల్సిన బాధ్య‌త ఇప్పుడు జ‌గ‌న్‌పైనే ఉంది. ఎన్నిక‌ల‌కు ముందు వ‌లంటీర్ల‌పైనే ఆధార‌ప‌డ్డారు. వ‌లంటీర్లు త‌న‌కు , త‌న పార్టీకీ విధేయులుగానే చెప్పుకొచ్చారు. కానీ.. ఎంతైనా వారు కూడా సాటి మ‌నుషులే క‌దా! ప్ర‌తిప‌క్షం.. రూ.10 వేలు ఇస్తామ‌న్న‌ప్పుడు.. వారు అటు ఎందుకు లొంగ‌కూడ‌దు.


ఇదే జ‌రిగింద‌ని వైసీపీ కూడా గుర్తించింది. అయితే.. ఇక్క‌డ చేసిన ప్ర‌ధాన పొర‌పాటు.. పూర్తిగా వ‌లంటీర్ల పైనే ఆధార ప‌డ‌డం. దీంతో కార్య‌క‌ర్త‌ల‌ను.. నాయ‌కుల‌ను కూడా.. జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. ఫ‌లితంగా పార్టీకి-కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు మ‌ధ్య బంధం తెగిపోయింది. ఇది కంచుకోటలు కూలిపోయేందుకు కార‌ణ‌మైంది. ఇప్పుడు తీరిగ్గా అయినా.. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన జ‌గ‌న్‌.. దీనిని స‌ర్దు బాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.


ముఖ్యంగా ఆయ‌న త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చే క‌న్నా కూడా.. ఆయ‌న ముందుగా పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. చంద్ర‌బాబు కు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎలా అయితే.. అండ‌గా ఉన్నారో.. ఆ విధంగా జ‌గ‌న్ కోసం.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అండ‌గా ఉండేలా చూసుకోవాలి. జ‌నాలు థ‌ర్డ్ ప్రియార్టీనే. ఏ పార్టీ అయినా ఇదే అవ‌లంభిస్తుంది. కానీ.. జ‌గ‌న్ వేసుకున్న ఈక్వేష‌న్ తేలిపోయింది. దీంతో ఇప్పుడైనా ఆయ‌న పార్టీని బ‌లోపేతం చేయ‌క‌పోతే.. క‌ష్ట‌మ‌నే భావ‌న వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: