గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మొదలైన బటన్ నొక్కుడు కార్యక్రమం ఏపీ రాజకీయాల్లో అనివార్యం అయింది. అవును, అయిదేళ్ల క్రితం ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ వివిధ పధకాల పేరుతో బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే జూలై నెలలో పాత బకాయిలు కలుపుకుని ఏకంగా ఇపుడు 7000 రూపాయలు సామాజిక పెన్షన్లను వృద్ధులకు అందించాల్సి ఉంది. అలాగే 4000 నుంచి 6000 రూపాయలు వరకు దివ్యాంగులకు ఇవ్వాలి. ఇలా పదహారు కేటగిరీలకు సామాజిక పెన్షన్లు భారీ పెంపుతో ఏకంగా 66 లక్షల మందికి నేడు పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం ఖర్చు అక్షరాలా 4500 కోట్ల రూపాయలు అంటే నమ్మితీరాల్సిందే.

అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు చెల్లించాల్సిన మొత్తం 6000 కోట్ల రూపాయలు ఇపుడు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే ఏకంగా 10,500 కోట్ల రూపాయలు తక్షణం ఖర్చు చేయాల్సిన అవసరం టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఉంది. వీటితో పాటు సూపర్ సిక్స్ అనే భారీ హామీల మాట ఉండనే ఉంది. అందులో రైతులకు భరోసా కింద 20 వేల రూపాయలు, తల్లికి వందనం పధకం కింద పాఠశాలకు వెళ్ళే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు, 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న ప్రతీ మహిళకూ నెలకు 1500 రూపాయలు, మరోవైపు కోట్లలో గ్యాస్ బండ స్కీమ్ అమలు చేయాల్సి ఉంది. దీని ఖర్చు కూడా అంచనా కడితే 4000 కోట్ల రూపాయలు దాకా ఉండొచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపధ్యంలో తక్షణం సంపద సృష్టించడం అంటే కత్తిమీద సాములాంటిదే. ఇక ఏపీకి ఆదాయ మార్గాలు పెద్దగా లేవనే సంగతి అందరికీ తెలిసిన కధే. గత ప్రభుత్వం అయితే అప్పులు చేసి మరీ పధకాల పేరిట పంచిపెట్టింది. వాటి అప్పులు కొండలా పేరుకుయిపోయాయి. వడ్డీలు ఇంకా కట్టాల్సి ఉంది. మరోవైపు ప్రభుత్వం గాడిన పడి ఆదాయాలు పెరగడానికి కచ్చితంగా రెండేళ్ళకు పైగా సమయం పడుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఉచిత హామీల గుదిబండను తగిలించుకున్నందుకు రెండేళ్ల పాటు ప్రభుత్వానికి తీరని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంక్షోభం లోతులను కూటమి ఏవిధంగా పూడ్చనుండి అని ఆంధ్ర జనాలు ఆశగా చూస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: