రాష్ట్రంలో మ‌రోసారి ఎన్నిక‌ల కోడ్ కూయ‌నుంది. రెండుకీల‌క ప‌ద‌వుల‌కు సంబంధించిన వ్య‌వహారం  తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త వానికి ఇప్ప‌టికే ఎన్నిక‌లు ముగిశాయి. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు వెంట‌నే ఎన్నిక‌లు రావ‌డం ఆశ్చ‌ర్య‌మే.కానీ, వైసీపీ త‌ర‌ఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఇద్ద‌రు నాయ‌కులు.. ఆ పార్టీకి హ్యాండిచ్చి ఎన్నిక‌ల‌కుముందు టీడీపీ పంచ‌న చేరిపోయారు. దీంతో వారిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డంతోపాటు.. మండ‌లిలోనూ అన‌ర్హ‌త వేటు వేయించారు. ఇప్పుడు ఆయా స్థానాల్లోనే ఎన్నిక‌లు రానున్నాయి. మొత్తంగా రెండు స్థానాలు అందుబాటులోకి వ‌చ్చాయి.


ఇక‌, ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అన‌ర్హ‌త‌కు గురైన సి. రామ‌చంద్ర‌య్య‌, మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌లు గ‌తంలో ఎమ్మెల్యే కోటా కిందే ఎన్నిక‌య్యారు. అప్ప‌ట్లో వైసీపీకి బ‌లం ఎక్కువ‌గా ఉండ‌డంతో వారు ఏక‌గ్రీవంగా ఎన్నికైన ప‌రిస్థితి కూడా ఉంది. అయితే.. ఇప్పు డు ఇదే ప‌రిస్థితి మ‌రోసారి రిపీట్ కానుంది. ప్ర‌స్తుతం కూట‌మి పార్టీలకు 164 మంది స‌భ్యులున్నారు. దీంతో వారంతా కూడా.. ఏక‌గ్రీవంగానే ఎన్నుకుంటారు. ఫ‌లితంగా మండ‌లికి ఎవ‌రిని ఎంపిక‌చేసినా.. కూట‌మి నుంచి వారు త‌ప్ప‌కుండా మండ‌లిలో అడుగు పెట్ట‌నున్నారు. దీంతో ఈ సీట్ల‌కు ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది.


పోటీ చేసి ఓడిపోయే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు బ‌రిలో ఉన్నారు. ఇలా ఈ వార్త వెలుగు చూసిందో లేదో.. మాకంటే మాకివ్వండ‌ని అనేక మంది నాయ‌కులు.. త‌మ త‌మ ప‌రిధిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్నా రు. ముఖ్యంగా ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీక‌ర్‌ ప్ర‌తిభా భార‌తి  ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆమె కుటుంబానికి రెండు సార్లుగా అస‌లు టికెట్లు కూడా ఇవ్వ‌డం లేదు. ఈ సారి ఎన్నిక‌ల వేళ కూడా.. ఆమె కుటుంబం టికెట్ కోసం ప్ర‌య‌త్నించింది. కానీ, పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కీల‌క ప‌ద‌విని ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.


దీంతో ఇప్పుడు ఖాళీ అయ్యే స్థానాల్లో ఆమె ఒక‌టి కోరుకుంటున్నారు. ఇక‌, జ‌న‌సేన కోసం సీటును ఖాళీ చేసి.. ఇచ్చిన పిఠాపు రం వ‌ర్మ క్యూలోనే ఉన్నారు. పైగా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చంద్ర‌బాబు బాహాటంగా హామీ ఇవ్వ‌క‌పోయినా.. అంత‌ర్గ తంగా మాత్రం.. ఆయ‌న‌కు హామీ ఇచ్చార‌ని స‌మాచారం. దీంతో వ‌ర్మ‌కు ఒక సీటు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇదే స‌య‌మంలో జ‌న‌సేన నుంచి కూడా కీల‌క నాయ‌కులు రెడీగా ఉన్నారు. ఇక‌, టీడీపీలోనూ టికెట్లు త్యాగం చేసిన వారు ఎదురు చూస్తున్నారు. వీరిలో మ‌హిళా నాయ‌కులు కూడా క‌నిపిస్తున్నారు. దీంతో ఎవ‌రికి ఈ రెండు సీట్లు ద‌క్కుతాయి.. రెండు పార్టీలు ఎలా స‌మ‌న్వ‌యం చేసుకుంటాయ‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: