తాజా ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘోర పరాభవానికి కారణం ఆ పార్టీలోని కొందరు నేతల వ్యావహారశైలి ఒక కారణంగా విశ్లేషకులు చెప్పిన సంగతి అందరికీ తెలిసినదే. అవును, ఇది కాదనలేని వాస్తవం. ఏపీ ప్ర‌జ‌లు వైసీపీని చీద‌రించుకునేందుకు, చిత్తు చిత్తుగా ఓడించేందుకు ఈ నోటి దూలత‌నం కూడా ఒక కారణం. అయితే ఆ విషయం తెలిసి కూడా తాజా కూటమి ప్రభుత్వంలో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవడం వారి వారి సంస్కారానికి అద్దం పడుతుందని విశ్లేషకులు వారిని అప్రమత్తం చేసే పనిలో పడ్డారు.

ఇదే శైలి గాని కొనసాగితే మాత్రం 2029లో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అధికారం ఉంది కదాని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం సమంజసం కాదు. ఆవేశాన్ని, ఆక్రోశాన్నీ.. క‌ట్ట‌డి చేసుకుని ముందుకు సాగితే.. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు మ‌రింత‌గా చూర‌గొనే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అసలు విషయంలోకి వెళితే, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, స్పీక‌ర్ రేసులో ఉన్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతున్న న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే అయ్య‌న్న పాత్రుడు.. తాజాగా అధికారుల‌పై నోరు చేసుకోవడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మునిసిప‌ల్ అధికారుల‌పై అన‌లేని మాట‌ల‌తో ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

తాజాగా త‌న నియోజ‌క‌వ‌ర్గం న‌ర్సీప‌ట్నం నుంచి విజ‌య‌వాడ‌కు వ‌స్తున్న క్ర‌మంలో ఆయ‌న మునిసిప‌ల్ అధికారుల‌ను ఉద్దేశించి ర‌హ‌దారులు, కాల్వ‌లు బాగోలేదంటూ.. వారిపై బూతులతో విరుచుకు పడ్డారు. ఇక‌, టీడీపీ మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా.. ఎక్కడపడితే అక్కడ నోరు జారుతున్నాడు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ... ఆక్రోశం ప్ర‌ద‌ర్శిం చారు. గ‌త వైసీపీ పాల‌న‌లో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అణిచివేత‌కు గుర‌య్యార‌న్న బాధపడిన ఆయ‌న‌.. ఇప్పుడు మాత్రం కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చి చెప్పడం ఒకింత హాస్యాస్పదం. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇక్క‌డే ఆక్రోశంలో నోరు జారుతూ... "టీడీపీ బిళ్ల పెట్టుకుని ఆఫీసుల‌కు వెళ్లండి. అక్కడ ఖచ్చితంగా మీకు అధికారులు కుర్చీవేసి.. టీ ఇచ్చి.. మీకు ప‌నులు చేస్తారు." అంటూ వ్యాఖ్యానించారు. ఇపుడు అదే వ్యాఖ్యలు టీడీపీకి చెడ్డపేరు తెచ్చిపెట్టేలా ఉన్నాయంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: