- శిష్యుడి మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌గా... రాజ‌కీయంగా దూరంగా
- రేవంత్‌తో ఎక్కువ స్నేహం చేస్తే మోడీతో గ‌లాటానే
- క‌ర్ర‌విర‌గ‌ని.. పాము చావ‌ని రాజ‌కీయ‌మే బాబుకు బెట‌ర్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

చాలా ఏళ్ల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో గురువు, శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరిద్దరూ గతంలో గురు, శిష్యులు అన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అంత సానుకూల వాతావరణం లేదు. తెలంగాణలో తొలి ఐదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే.. ఆంధ్రాలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు మధ్య ఓటుకునోటు కేసు నుంచి గ్యాప్ బాగా పెరిగిపోయింది.


చివరకు 2018 ముందస్తు ఎన్నికలలో కేసీఆర్‌ను గద్దె దించటానికి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అయినా కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలలో ఆంధ్రాలో చంద్రబాబును ఓడించేందుకు.. కెసిఆర్ పరోక్షంగా జగన్ కు తన సహాయ సహకారాలు అన్ని అందించారు. విచిత్రం ఏమిటంటే జగన్ ఆంధ్ర ముఖ్యమంత్రి అయ్యాక తొలి ఏడాది పాటు కేసీఆర్ జగన్ సన్నిహితంగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాతావరణం చెడింది. అయితే ఈసారి సీన్ మారిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులు ఇంకా చెప్పాలంటే గురు, శిష్యులు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.


అక్కడ ఉన్నది తన శిష్యుడు కదా అని చంద్రబాబు మరీ చనువు తీసుకుని రాజకీయం చేయటానికి ఛాన్స్‌ లేదు. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట‌మిలో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పైగా తెలంగాణలో వచ్చే ఎన్నికలనాటికి అధికారంలోకి రావాలని బిజేపి విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి టైంలో రేవంత్ తో మరీ చనువుగా ఉంటే అది చంద్రబాబుకు.. మోడీ వైపు నుంచి తెలంగాణ బిజేపీ వైపు నుంచి ఇబ్బందికర వాతావరణం ఏర్పడవచ్చు. అలా అని రేవంత్‌కు వ్యతిరేకంగా పూర్తిగా రాజకీయం చేయలేని పరిస్థితి.


కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా తన శిష్యుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తో సన్నిహిత సంబంధాలు నెరవేర్చాల్సి ఉంటుంది చంద్రబాబు. పైగా ఇప్పుడు అటు బిఆర్ఎస్ కూడా చంద్రబాబు మీద ఎలా లేదన్న కారాలు, మిరియాలు నూరుతూ.. ఏపీలో జగన్‌కు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తెలంగాణలో బీజేపికి ఏకంగా కాంగ్రెస్‌తో సమానంగా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. ఈ టైం లో కాంగ్రెస్‌తో.. రేవంత్‌తో.. సన్నిహితంగా ఉంటే తెలంగాణ బీజేపి వాళ్లకు చంద్రబాబు మీద ఖచ్చితంగా కోపం ఉంటుంది. అదే జరిగితే మోడీతోపాటు కేంద్ర బీజేపి పెద్దలు కూడా చంద్రబాబును అనుమానించటానికి అవకాశం ఉంటుంది. అందుకే చంద్రబాబు ఎంత తన శిష్యుడు అయినా ఎంత మంచి స్నేహితుడు అయినా రేవంత్ తో మరీ సన్నిహిత రాజకీయం చేసే వీలు అయితే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: