- కొత్త ప్ర‌భుత్వాల‌తో రెండు న‌గ‌రాల మ‌ధ్య కొత్త క‌నెక్టివిటి
- వ్యాపారాలు, స్నేహాల్లో హెల్దీ వాతావ‌ర‌ణం

( విజయ‌వాడ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో పదేళ్లపాటు ఏక చక్రాధిపత్యంగా పరిపాలన చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రాలో వైఎస్ జగన్ ప్రభుత్వం కూలిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. సహజంగానే చంద్రబాబు, రేవంత్ స్నేహితులు.. గురుశిష్యులు కావడంతో రెండు రాష్ట్రాల మధ్య మరీ అంత శత్రుత్వ వాతావరణం, మరి అంత విమర్శలు, ప్రతి విమర్శలతో కూడిన ఘాటు రాజకీయం అయితే ఉండదనే అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ కీలక నగరం విజయవాడ మధ్య అనుకున్న స్థాయిలో సుహృద్భావ వాతావరణం అయితే లేదు.


అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలలో సానుకూల దృక్పథంతో వ్యవహరించే ప్రభుత్వాలు ఏర్పడడంతో విజయవాడకు హైదరాబాద్‌తో సానుకూల వ్యాపార దృక్పథం ఏర్పడుతుందని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర పరిధి వరకు విజయవాడ రహదారి విస్తరణ పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా తో పాటు కనెక్టివిటీ చాలా స్పీడ్ గా, వేగంగా ఉండాలని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ రహదారి విస్తరణ పనులు మరింత వేగంగా జరిగేలా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తున్నామంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


ఇక హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల విషయంలో గతంలో ఎంతో కొంత ఆందోళన ఉండేది. సీఎం కేసీఆర్ వీళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించినా.. ఒక్కోసారి ఆయన కామెంట్లు గందరగోళంగా అనిపించేవి. హైదరాబాద్‌లో ఉన్న.. లేదా తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల విషయంలో ఆందోళన కలిగించేలా ఉండేవి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవని చెప్పవచ్చు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఒక అండర్ స్టాండింగ్ తో వ్యవహరిస్తే హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య మరింత గొప్ప అనుబంధం ఏర్పడుతుందటంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: