ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొలువుదీరారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాబు క్యాబినెట్లో మొత్తం 25 మందికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 24 మందికి మంత్రులుగా అవకాశం ఇవ్వడంతో పాటు వారికి శాఖలు కూడా కేటాయించారు. ఇక చంద్రబాబు క్యాబినెట్‌లో మిగిలిన ఒకే ఒక బెర్త్‌ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరికొందరు భారీ లాబీయింగ్‌ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ బెర్త్‌ కోసం కేంద్ర మాజీ మంత్రి.. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన సుజనా చౌదరి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


ఆయన ఈ ఎన్నికలకు ముందు అనూహ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపి సీటు దక్కించుకుని పోటీ చేసి ఏకంగా 53,000 ఓట్ల భారీ మెజార్టీతో సంచలన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీకి ఇంకా చెప్పాలంటే బీజేపికి కూడా అంత సానుకూల వాతావరణం లేని విజయవాడ పశ్చిమం లాంటి నియోజకవర్గం లో బీజేపి నుంచి పోటీ చేసిన సుజనా 53,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం అంటే అది మామూలు ఘనవిజయం కాదని చెప్పాలి. గతంలోనే కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజన ఈసారి తనకు చంద్రబాబు క్యాబినెట్లో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే తొలి విడతలో బీజేపి జాతీయ నాయకత్వం సత్య కుమార్ యాదవ్ వైపు మగ్గుచూపింది.


అయితే ఇప్పుడు సుజన జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలు.. కేంద్ర మాజీ మంత్రి కావడంతో అక్కడ నుంచి లాభం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కేంద్ర బీజేపి పెద్దలు ఒప్పుకుంటే సుజనకు మంత్రి పదవి ఇవ్వటంలో చంద్రబాబుకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే ఇక్కడే మరో చర్చ కూడా నడుస్తోంది. ఈసారి కేబినెట్లో క్షత్రియ సామాజికవ‌ర్గానికి చెందినవారికి చంద్రబాబు ఒకరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. తమకు తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని క్షత్రియ‌ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్ద గట్టిపట్టు పడుతున్నట్టు తెలుస్తోంది.


ఈసారి కూట‌మి నుంచి మొత్తం ఏడుగురు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఈ ఎన్నికలలో ఈ సామాజిక వర్గం వన్ సైడ్ గా కూటమి విజయానికి కృషి చేసింది. బీజేపి తరఫున అయితే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ నుంచి అయితే ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు రేసులో ఉన్నారు. మరి చంద్రబాబు క్యాబినెట్‌లో ఈ ఒక్క బెర్త్ దక్కించుకునే ఆ లక్కీ పర్సన్ ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: