ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఎన్నికలకు ముందు జంపింగ్ జపాంగ్‌లు జోరుగా సాగాయి. పలు పార్టీలకు చెందిన నేతలు.. ఇతర పార్టీలలోకి వలసలు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న వంశీకృష్ణ యాదవ్, శ్రీ రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ లాంటి వారు కూడా పార్టీలు మారిపోయారు. శ్రీ రామచంద్రయ్య, ఇక్బాల్ ఇద్దరు తెలుగుదేశం పార్టీ వైపు వెళితే.. వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి వెళ్లి విశాఖ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదిలా ఉంటే పార్టీ మారిన నేపథ్యంలో వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్సీ రఘురాజు పదవిపై కూడా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.


ఇక ఇక్బాల్, శ్రీ‌ రామచంద్రయ్య పదవులు కోల్పోయిన నేపథ్యంలో ఆ రెండు స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కావడంతో రెండు పదవులు కూటమి అభ్యర్థులకే దక్కనున్నాయి. ఇప్పుడు ఈ రెండు పదవులు ఎవరికి ఇస్తారు..? అన్నది సహజంగానే ఆసక్తిగా మారింది. రామచంద్రయ్య, ఇక్బాల్ ఇద్దరు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినవారు. పైగా ఇద్దరు వేరువేరు సామాజిక వర్గాలకు చెందినవారు. తిరిగి ఈ రెండు పదవులు వీళ్ళకే ఇస్తారా.. అన్న విషయంలో కొంత సందేహం ఉంది.


మరో చర్చ ప్రకారం శ్రీ‌ రామచంద్రయ్య స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పేరు వినిపిస్తోంది. ఇక ఇక్బాల్ సీటును జనసేనకు కేటాయిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే జగన్ ను వదులుకొని వచ్చిన ఇక్బాల్, రామచంద్రయ్య తమ ఎమ్మెల్సీ పదవులు కోల్పోవడంతో పాటు.. ఇప్పుడు అధికార పార్టీలకు వచ్చిన ఎలాంటి పదవి లేకుండా జీరోలుగా మిగిలి పోవాల్సి ఉంటుంది. మరి వీరికి తర్వాత అయినా చంద్రబాబు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: