ఏపీ సీఎం చంద్రబాబు తిరుగులేని భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. కూటమి ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలకు గాను ఏకంగా 164 స్థానాలలో అప్రతిహత విజయం సాధించింది కూటమి అభ్యర్థులు కేవలం 11 స్థానాలలో మాత్రమే ఓడిపోయారు. ఈ 11 స్థానాలలో బీజేపి నుంచి పోటీ చేసిన అభ్యర్థులు రెండు చోట్ల ఓడిపోతే ఇక తెలుగుదేశం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు మరో తొమ్మిది స్థానాలలో ఓడిపోయారు. దర్శి లాంటి చోట టీడీపీ గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయింది. ఇదిలా ఉంటే టీడీపీ నుంచి పోటీ చేసిన ఆ తొమ్మిది మంది అభ్యర్థులు ఇప్పుడు చంద్రబాబును కలుస్తున్నారు. ఈ క్రమంలోని కొందరు అభ్యర్థులకు ఆయన దిమ్మతిరిగే షాక్ లు ఇస్తున్నట్టు తెలుస్తోంది.


పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాలలో అభ్యర్థులు భవిష్యత్తులో ఎలాంటి పదవులు అడగకుండా ఉండేందుకు.. వారి ముందరకాళ్ల‌కు బంధం వేసినట్టుగా చంద్రబాబు కామెంట్లు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తాజాగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేటలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రహ్మణ్యం.. చంద్రబాబును కలిశారు. పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో కూడా రాజంపేటలో తెలుగుదేశం గెలిచింది. పార్టీ కంచుకోటలో ఈసారి ఎందుకు ఓడిపోయాం అని బాలసుబ్రహ్మణ్యంను చంద్రబాబు ప్రశ్నించినట్టు తెలిసింది.


అయితే ఎన్నికలకు ముందు చివరి క్షణంలో వైసీపీ నుంచి వచ్చిన వారు కొందరు తనకు సహకరించలేదని చెప్పే ప్రయత్నం చేసినా.. బాబు అసహనం వ్యక్తం చేయడంతో పాటు.. తాను, పవన్ కళ్యాణ్ స్వయంగా రాజంపేటకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చినా.. నువ్వు గెలవలేదని చిర్రుబుర్రులాడినట్టు తెలిసింది. అలాగే రెండు రోజుల క్రితం తంబళ్లపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయిన జయ‌ చంద్రారెడ్డి సైతం చంద్రబాబును కలిస్తే పార్టీ 2014లో గెలిచిన చోట నువ్వు ఎందుకు ఓడిపోయావు.. సరిగ్గా పనిచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.


వాస్తవంగా తంబళ్ల పల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే శంకర యాదవ్ కు బదులుగా జయ చంద్రారెడ్డికి సీటు ఇవ్వడం చాలామందికి ఇష్టం లేదు. ఒకానొక దశలో ఆ సీటును బీజేపికి ఇవ్వాలని కూడా అనుకున్నారు. ఇప్పుడు అక్కడ పోటీ చేసిన జయ‌ చంద్ర రెడ్డి పై సైతం బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థులలో కొందరి విషయంలో బాబు వారికి పదవులు ఇవ్వడం, ఇతర సహాయ సహకారాలు అందించే విషయంలో అంత సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: