ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన మెగా డీఎస్సీ అంశంపై కీలక ముందడుగు వేశారు.సీఎంగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం సంబంధిత దస్త్రంపైనే పెట్టారు.గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీని సవరించి టీడీపీ ప్రభుత్వం కొత్తగా మెగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిప్రకారం.. 16347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇంకా వరుసగా ఆయా శాఖల మంత్రులు తమ తమ బాధ్యతలు స్వీకరిస్తున్నారు అందులో భాగంగానే పెనుకొండ తెదేపా శాసనసభ్యురాలు ఐనా సవిత గురువారం అమరావతిలోని సచివాలయం నాల్గో భవనంలో ఆమె బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్,ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పథకాలపై మొదటి, రెండో సంతకాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని అయితే ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశానన్నారు.బీసీ కులానికి చెందిన మహిళకు వెనకబడిన తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంలో ఉన్న32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను 106 కి పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు. రాష్ట్రం బాగుండాలనే తపన కలిగిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. దేశానికి బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో తనకు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: