వైసీపీ నుంచి జంపింగులు రెడీ అవుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లో వైసీపీ నాయ‌కులు.. ఈ దిశ‌గానే అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. చంద్ర‌బాబు పాల‌న ఎలానూ ఐదేళ్లు ఉంటుంది. రెండోది .. త‌దుప‌రి ఐదేళ్ల‌లో జ‌న‌సేన పుంజుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న ప‌వ‌న్‌.. ఐదేళ్ల త‌ర్వాత‌.. త‌న‌ను తాను ఎలివేట్ చేసుకుని ముఖ్య‌మంత్రి స్థాయికి ఎదుగుతార‌నే చ‌ర్చ సాగుతోంది.


ఇదే జ‌రిగితే.. జ‌న‌సేన సానుభూతి ప‌వ‌నాలు పెరిగి.. వైసీపీకి మ‌రోసారి అధికార‌పు ఆశ‌లు స‌న్న‌గిల్లే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇది.. పార్టీ నాయ‌కుల‌ను ఆలోచింప చేస్తోంది. రాజ‌కీయాల్లో ఎవ‌రు ఉన్నా.. అధికార‌మే ప‌ర‌మావ‌ధి. జ‌గ‌న్‌పై ఎంత ప్రేమ ఉన్నా.. ప‌దేళ్లు ఆయ‌న వెంట ప్ర‌తిప‌క్షంలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండాల‌ని కోరుకునేవారిసంఖ్య నామ‌మాత్రం. పైగా.. వైసీపీని బ‌లోపేతం చేసింది కూడా..జంపింగులే. ఈ కార‌ణంగానే వారు త‌మ భవిత‌వ్యాన్ని ప‌దిలం చేసుకునేందుకు ప్ర‌యత్నిస్తున్నారు.


దీంతో జ‌న‌సేన లేదా.. టీడీపీ ఏది బాగుంటుంద‌ని అనుకుంటే.. దాని వైపు మొగ్గు చూపేందుకు రెడీ అవుతున్నారు. దీనిలో ఎక్కువ‌గా జ‌న‌సేన వైపు ఆక‌ర్షితులు అవుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డమే. వ‌చ్చీ రావ‌డంతోనే ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠం కోరుకోకుండా.. డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఎంచుకున్నారు. త‌ద్వారా ఈ ఐదేళ్లు కూడా ఆయ‌న రాజ‌కీయంగా, పాల‌న ప‌రంగా త‌న‌ను తాను తీర్చిదిద్దుకుంటారు. ఇది ప్ర‌జ‌ల్లో ఆయ‌న పై విశ్వాసాన్ని పెంచుతుంది.


వ‌చ్చే ఐదేళ్ల త‌ర్వాత‌.. ప‌వ‌న్ మ‌రింత రాజ‌కీయంగా శ‌క్తిమంతుడు అవుతాడు. దీంతో మ‌రింతగా జ‌న‌సేన ఓటు బ్యాంకు పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఫ‌లితంగా ప్ర‌స్తుతం 21 స్థానాల‌కు ఆయ‌న ప‌రిమితం అయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. మ‌రిన్ని సీట్ల‌లో పోటీ చేయ‌డం ఖాయం. ఇలా చేసేందుకు కీల‌క‌మైన అభ్య‌ర్థులు ఆ పార్టీకి అవ‌స‌రం అవుతారు. దీంతో ఇప్పుడే ఆ పార్టీలోకి చేరితే.. త‌మ‌కు సీట్లు ప‌దిలం అయ్యే అవ‌కాశంతోపాటు.. త‌మ ఆర్థిక శ‌క్తిని కూడా.. పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని నాయ‌కులు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే వైసీపీ నేత‌ల‌ను జంపింగుల దిశ‌గా అడుగులు వేయిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: