ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రెండో రోజే వైసీపీ డుమ్మా కొట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ టార్గెట్ గా జరుగుతున్న కూల్చివేతలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనకు, తమ పార్టీకి జరుగుతున్న అన్యాయం గురించి జగన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయగా ఆ ట్వీట్ వైరల్ అయింది.
 
అయితే సోషల్ మీడియాలో ట్వీట్లతో ప్రశ్నించడానికి బదులుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ మాటల తూటాలతో టీడీపీ, జనసేన నేతలకు చుక్కలు చూపించొచ్చుగా జగన్ అని వైసీపీ అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ప్రజల మద్దతు ఉంటుంది. అందుకు చంద్రబాబు కానీ జగన్ కానీ అతీతులు కాదు. వైసీపీ ఫ్యాన్స్ కోరుకునే విధంగా జగన్ లేరు.
 
2019కు ముందు ప్రజలతో మమేకమై ప్రజల మెప్పు పొంది తిరుగులేని స్థానాల్లో వైసీపీ విజయం సాధించడానికి కారణమైన జగన్ ను అభిమానులు కోరుకుంటున్నారు. కార్యకర్తలు, అభిమానులకు అనుక్షణం అండగా నిలబడుతూ కష్టాల్లో సైతం తోడుగా ఉండేలా జగన్ నిలవాలని పార్టీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. జగన్ ఒకప్పటిలా రాజకీయాలు చేస్తే తనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్లకు సైతం మళ్లీ దగ్గరయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
 
ప్రజలకు, జగన్ కు మధ్య ఒకింత గ్యాప్ వచ్చిందని ఆ గ్యాప్ ను తగ్గించుకునే దిశగా జగన్ అడుగులు వేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఇప్పుడు కాకపోయినా మరో రెండేళ్ల తర్వాత అయినా పాదయాత్ర దిశగా అడుగులు వేస్తే కోరుకున్న లక్ష్యాలను సాధించే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరి జగన్ ప్రణాళికలు, వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఏపీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటే భవిష్యత్తులో మళ్లీ వైసీపీకి అధికారం దక్కుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: