శుక్రవారం నాడు జరిగిన ఏపీ అసెంబ్లీ శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం జగన్ వస్తారా రారా అనేది అందరిలోనూ మదిలే తలెత్తుతున్న ప్రశ్నల్లో ఒకటి ఏదైతేనేం చివరికి ఆయన వచ్చి ప్రమాణస్వీకారం చేసి వెళ్లిపోయారు.కాకపోతే ఆయన తీరు మాత్రం అందర్నీ షాకయ్యేలా చేసింది.సహజంగా జగన్‌లో ఆత్మన్యూనతాభావం ఎక్కువగా ఉంటుందనీ ఆయన సన్నిహితుల నుండి తెలుస్తుంది.అందుకేనేమో ఏదైనా విషయం చెప్పాలన్నప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు.ప్రమాణస్వీకారం రోజు జగన్ తీరు కూడా అలానే ఉంది.అయితే మొదటి రోజు అసెంబ్లీకి జగన్  వెనక గేటు నుంచి వచ్చి తనకు కేటాయించిన సీట్ లో కూర్చొని తన వంతు సమయం వచ్చినపుడు మాత్రమే వెళ్లి ప్రమాణం చేసి వెంటనే అక్కడనుండి వెళ్లిపోయారు. ఆవిధంగా జగన్ అసెంబ్లీలో ఫస్ట్ డే ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేని వ్యక్తిలా వ్యవహరించారనేది మనం మీడియా ద్వారా చూసాం.రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. గెలిస్తే ప్రజలకు సేవ చేస్తామనీ, ఓడిపోతే, ప్రజలను పట్టించుకోము అనే తీరు సరైనది కాదు. కానీ వైసీపీ తీరు ఇలాగే కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.అయితే రెండో రోజు జరిగే స్పీకర్ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ చేయాల్సిన బాధ్యత ఉందని తెలిసి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు రాకూడదు అని వైసీపీ నిర్ణయించుకుంది. 11 సీట్లే వచ్చినప్పటికీ వైసీపీ అనేది ప్రతిపక్షమే కాబట్టి ఆ పార్టీ తన బాధ్యతను నిర్వర్తించకుండా సభకే రాకూడదు అన్నట్లుగా వ్యవహారించడం అనేది కరెక్ట్ కాదని విశ్లేషకులు అంటున్నారు.

నిజానికి వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. కాబట్టి ఆయన ఆ 40 శాతం మంది ప్రజలకు ప్రతినిధిగా సభలో ధైర్యంగా అడుగుపెట్టి కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. ఐదేళ్ల తర్వాత తిరిగి కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమా మిగిలిన ప్రజలకు చెప్పాలి.అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఆచరణ సాధ్యం కాని పథకాలను ఎలా అమలుచేస్తుందో చూస్తా అన్నట్లు గంభీరంగా ఉండాలి. తనకు ఓటు వేసి వారి పక్షాన అసెంబ్లీలో తాను ఉన్నానని జగన్ ధైర్యంగా నిలబడాలి. అది మానేసి తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడం సబబు కాదనే వాదన వినిపిస్తోంది.అయితే అసెంబ్లీ రెండో రోజు వైసీపీ అధినేత జగన్ వెళ్లకపోవడం పై పలువురు నేతలు మరి వైసీపీకి ఓట్లు వేసిన ప్రజల సంగతేంటి? వారి తరపున అసెంబ్లీలో గొంతు వినిపించాలి కదా? ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి కదా. కాని వదిలేస్తానంటే ఎలా? అని విమర్శిస్తూన్నారు.ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి జగన్ తీరు ఇలానే ఉందని తనకు ఓట్లు ఎందుకు వెయ్యలేదో అని ప్రజలను తప్పుపుడుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఓట్లు వేసిన వారికి భరోసాగా ఉండాల్సిన జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదనుకునే తీరు సరైనది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మాజీ సీఎం జగన్ తనకేమీ పట్టనట్టుగా పులివెందులకు వెళ్ళారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడుబడితే అప్పుడు ఉండవని అవి జరిగే టైములోనే ప్రజల తరపున ప్రతిపక్షంగా జగన్ ప్రశ్నించాలి కానీ ఈరకంగా సభకు డుమ్మాకొట్టి పులివెందులకు వెళ్లాలనుకోవడం కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఎన్ని రాజకీయాలు ఉన్నా ఫలితాలు వచ్చాక ప్రజాక్షేమం కోసమే పనిచేయాలని అంతేగాని  పంతాలకు పోయి బాధ్యతను విస్మరించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: