- క‌క్ష‌లు, క‌ల్మ‌షాలు లేని రాజ‌కీయాలు
- పార్టీలు, వ‌ర్గాల‌తో సంబంధం లేకుండా అభివృద్ధి
- మ‌నం లేక‌పోయినా మ‌న పేరు చ‌రిత్ర‌లో ఉండాల‌న్న సంక‌ల్పం

( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ )

ప్రస్తుతం ఉన్న సమకాలిన రాజకీయాలలో క్లీన్ ఇమేజ్ తో కొనసాగుతూ ప్రజలకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలన్న తపన, సంకల్పం ఉన్న రాజకీయ నేతలు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. విద్యాసంస్థల అధినేత విజ్ఞాన్ రత్తయ్య వారసుడు ఆయన. లావు శ్రీకృష్ణదేవరాయలు 2014 ఎన్నికల టైం లో తెలుగుదేశం పార్టీ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. చంద్రబాబు విజన్ అంటే లావుకు ఎంతో ఇష్టం. అయితే ఆ ఎన్నికలలో లావుకు సమీకరణలు కలిసి రాలేదు. ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయిన లావు.. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. చివర్లో వైసీపీ అధిష్టానం మార్పులు చేయడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో ఒకటైన నరసరావుపేట పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.


అప్పటికప్పుడు గుంటూరు నుంచి నరసరావుపేటకు మారినా అక్కడ చేసిన వర్క్‌, ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటు.. సౌమ్యుడు, వివాదాస్పద రాజకీయాలకు దూరంగా ఉండే నేత కావడంతో లావుకు భారీ మెజార్టీ కట్టబెట్టి పలనాడు ప్రజలు పార్లమెంటుకు పంపారు. అయిదేళ్లలో ఆయన చేసిన సేవలు నిజంగానే తెలుగు ఎంపీలు ఎవరు చేయలేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన లావులో ఎక్కువగా కనిపించేది. పల్నాడు రైతులకు కొన్ని దశాబ్దాల కల‌ అయినా వరిక‌ పూడిసెల ప్రాజెక్టు కోసం నరసరావుపేట నుంచి ఎంతోమంది ఎంపీలు గెలిచినా... ఎవరి వల్ల కానీ పర్యావరణ అనుమతులు.. కేంద్రం నుంచి వచ్చేలా చేయడంలో లావు అవిశ్రాంత పోరాటం చేశారు. ఇక పార్లమెంటు పరిధిలో ప్రత్యేకంగా తన సొంత నిధులతో ఎక్స్‌కవేటర్లను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పుంత రోడ్లు పోయడం ద్వారా రైతుల పట్ల తనకు ఎంత మక్కువ ఉందో చెప్పకనే చెప్పారు.


కొన్ని వందల కిలోమీటర్లు రైతులకు పుంత రోడ్లు పోసి పార్టీలకు అతీతంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఏ ఎంపీ ఇలా చేయలేదు అంటే అతిశ‌యోక్తికాదు. పార్టీలు, వర్గాలు మనకు ఓటు వేశాయా.. లేదా.. అన్నది లావుకు అనవసరం. అటుపక్క ఉన్నది ఎవరు ? అయినా కష్టాల్లో ఉంటే మనకు చేతనైన సాయం చేయాలి అన్నదే లావు సిద్ధాంతం. తన పార్లమెంటు పరిధిలో లేకపోయినా అమరావతి ప్రాంత రైతులు, అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తుంటే లావు స్వయంగా వచ్చి.. వారికి తన మద్దతు తెలిపారు. ఇలా కొన్ని విషయాలలో తాను అధికార పార్టీలో ఉండి కొంత వ్యతిరేకతకు గురైనా.. సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నా.. తాను చేసే పనిలో నిజాయితీ ఉందని నమ్మిన లావు ఎక్కడ వెనకడుగు వేయలేదు.


నిజంగా లావు మనస్తత్వానికి, అప్పుడు తాను ఉన్న అధికార పార్టీకి ఏమాత్రం సరిపడదు. ఇతని విజన్ వేరు. ఇతను ఎదుగుదల అప్పటి పార్టీలోనే కొందరు నేతలకు నచ్చేది కాదు. సామాజిక సమీకరణలపరంగా తమను ఎక్కడ డామినేట్ చేస్తాడు..? తమ కంటే ఎక్కడ మంచి పేరు ఉంటుందో..? అన్న ఆందోళన కూడా ఆ పార్టీ నేతలకు ఉండేది. అయినా లావు మనలను ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు ఏదైనా చేయాలి అని గట్టిగా పోరాటం చేసేవారు... అందుకే చివరకు లావుకు ఎంపీ టికెట్ ఇవ్వడం లేదని జగన్ చెప్పినా.. తన పార్లమెంటు పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అలాంటి నాయకుడిని వదులుకొని తప్పు చేయవద్దు అని సూచించారు. ఏది ఏమైనా పార్టీ మారినా లావు నరసరావుపేట పార్లమెంటు చరిత్రలో రెండున్నర దశాబ్దాల తర్వాత వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచి సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు.


టీడీపీ నుంచి గెలిచిన లావుకు చంద్రబాబు ఎంతో పెద్ద బాధ్యత అప్పగించారు. కీలకమైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా నియమించారు. ఇప్పుడున్న పరిస్థితులలో పార్లమెంటులో పోరాటం చేసి రాష్ట్రానికి ప్రత్యేక నిధులు రప్పించడంలో తన టీంతో కలిసి లావు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలపై సూటిగా స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం, మంచి వాగ్దాటి, గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉన్న పరిచయాలు ఇవన్నీ కూడా లావుకు కలిసి రానున్నాయి. ఏది ఏమైనా గుంటూరు జిల్లాలోని ఉన్న రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రప్పించడంలోనూ ఇటు పోలవరంతోపాటు.. రాష్ట్రానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చేలా చేయడంలో లావు ఎలాంటి పాత్ర పోషిస్తాడు..? ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమిలో ఉండడంతో ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకునేలా ప్రణాళికలు రచిస్తారు..? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: