- గ‌తంలో కేంద్ర‌మంత్రిగా ఉన్నా త‌న మార్క్ ప‌నొక్క‌టీ లేదు
- విభ‌జిత ఏపీలో చిన్నమ్మ మార్క్ ప‌నులు కావాల్సిందే
- రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ద‌శ మార్చే గోల్డెన్ ఛాన్స్‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వార‌సులలో రాజకీయంగా రాణించింది ఇద్దరు మాత్రమే. ఒకరు ఏపీ బీజేపీ అధ్యక్షరాలుగా ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎంపీగా ఉన్న దగ్గుబాటి పురందరేశ్వరి. రెండోది ఎన్టీఆర్ తనయుడు హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ. పురందరేశ్వరి కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముందుగా బాపట్ల తర్వాత విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచిన నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పుడు సమైక్య రాష్ట్రం ఉండడంతో పాటు.. రాష్ట్ర విభజన ఉద్యమ నేపథ్యంలో పురందరేశ్వరి కేంద్రమంత్రిగా ఉన్న తెలుగు ప్రజలకు సేవ చేసే విషయంలో తనదైన ముద్ర వేయలేకపోయారు. తర్వాత బీజేపీలోకి వెళ్లినా వరుసగా రాజంపేట, విశాఖపట్నం నుంచి పోటీ చేసి గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈసారి ఎన్నికలకు ముందు ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా రావడంతో పాటు.. ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం పార్లమెంటుకు పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.


ఆమెకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న అంచనాలు ఉన్నా.. ఆ పదవి రాలేదు. తర్వాత ప్రక్షాళనలో అయినా పురందేశ్వ‌రికి కేంద్ర మంత్రి పదవి వస్తుందని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ రాజకీయ వారసురాలిగా, ఎన్టీఆర్ కుమార్తెగా తెలుగు ప్రజల మధ్యలో చెరగని ముద్ర వేసుకునే మంచి లక్కీ ఛాన్స్ పురందేశ్వ‌రికి ఇప్పుడే వచ్చింది. ఆమె లోక్‌స‌భ ఎంపీగా ఉన్నారు. పైగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో ప్రతిష్టాత్మకమైన రాజధాని అమరావతితో పాటు.. పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించే విషయంలో, రైల్వే ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ విషయంలో, ఇక తాను ఎంపీగా ఉన్న రాజమహేంద్రవరానికి వరాల వాన కురిపించుకునే విషయంలో పురందేశ్వ‌రికి ఇంతకు మించిన అవకాశం రాదని చెప్పాలి.


మరో రెండేళ్లలోనే గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈ టైంలో రాజమండ్రి కి భారీగా నిధుల వరద పారించి అభివృద్ధి చేసే అవకాశం పురందరేశ్వరి చేతుల్లో ఉంది. ఇటు ఏపీ బీజేపీ అధ్యక్షరాలుగా ఉండడంతో ఏపీకి గత పదేళ్లలో బీజేపీ చేసినదేమి లేదన్న విమర్శలు రాకుండా చూసుకోవడంలోనూ.. ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు రప్పించే విషయంలోనూ పురందరేశ్వరి ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆమెపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలలో సగం అందుకున్న పురందేశ్వరి తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెక్కుచెదరని స్థానం ఏర్పరచుకున్నట్టు అవుతుంది. నిజం చెప్పాలంటే పురందేశ్వ‌రికి ఎప్పుడు లేనంత మంచి అవకాశం ఇప్పుడే వచ్చింది. మరి దానిని ఆమె ఎంతవరకు ? అందిపుచ్చుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: