ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం పాలైంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయంతో యావత్ దేశం ఏపీ వైపు చూసింది.ఇప్పుడు అదే స్థాయిలో ఓటమి ఎదురు కావడంతో దేశమే ఆశ్చర్యపోయింది. చివరికి ప్రత్యర్థిగా ఉన్న కూటమి నేతలు సైతం ఊహించని విజయం సొంతమయ్యింది. ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే గుణపాఠాలు నేర్చుకుంటున్న వైసిపి అసలు తప్పు ఎక్కడ జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.పార్టీని చక్కదిద్దాలనుకుంటే అధికారం నుంచి అధఃపాతాళానికి వైసీపీ ఎందుకు దిగజారిందో ఇకనైనా విశ్లేషించుకోవాలి. పార్టీకి భవిష్యత్ ఉండాలంటే ఇలాంటి అంశాలపై లోతైన విశ్లేషణ అవసరం కూడా. దారుణమైన ఈ అపజయాన్ని తొందరగా మరిచిపోవాలని లైట్ తీసుకుంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లోనూ ఇలాంటి పరాభవమే ఎదురు అవుతుంది. ఓటమి గురించి చర్చిస్తూ కూర్చుంటే నేతల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని జగన్ అంచనా వేస్తునట్టున్నారు. అందుకే ఓటమిపై ఎక్కువ డిస్కషన్ చేయడం లేదు. బయటకు చెప్పకపోయినా నేతలకైనా ఓ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అధినేతగా జగన్ పై ఉంది. అలా చేయకపోవడం వల్లే వైసీపీలోని ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఓటమికి జగన్ కారణమని, సజ్జల వలనే ఈ పరిస్థితి వచ్చిందని మొదట్లో కొంతమంది నేతలు పెదవి విరిచారు. తాజాగా గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ…కూల్చివేతల వలన ఓడిపోయామని వ్యాఖ్యానించారు. విధ్వంసమే అధికారం నుంచి అధఃపాతాళానికి తొక్కిపెట్టిందన్నారు. నాసిరకం మద్యం అమ్మకాలతో పాటు సజ్జల , కొడాలి నాని, వంశీ , రోజా వంటి నేతల బూతులూ పార్టీ ఓటమికి ఓ కారణమని మరో నేత కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటమిపై జగన్ క్లారిటీ లేకపోవడంతోనే నేతలు ఇలా కన్ఫ్యూజన్ చేసే కామెంట్స్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.జగన్ రెడ్డి ఇకనైనా పార్టీ ఓటమిపై లోతైన సమీక్ష చేసి స్పష్టత ఇవ్వకపోతే మరిన్ని ధిక్కారస్వరాలు వినిపిస్తాయి. పార్టీ భవిష్యత్ కు ఇది ఏమంత మంచిది కాదు. కొసమెరపు ఏంటంటే.. పార్టీ ఓటమికి అసలు కారణం ఏంటో జగన్ కూడా గుర్తించినట్లుగా కనబడటం లేదు. ఇంకెప్పటికీ ఆయన ఈవీఎంల భ్రమల నుంచి బయటకు వచ్చి అసలు విషయం గుర్తిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: