- ప‌ద‌వులు త‌క్కువ‌.. నేత‌లు ఎక్కువ‌
- ప్ర‌యార్టీ విష‌యంలో బాబుకు పెద్ద త‌ల‌నొప్పే
- దేవినేని ఉమా, వ‌ర్ల రామ‌య్య‌కు కీల‌క ప‌ద‌వులు..!

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

తాజాగా టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు బిగ్ టెస్ట్ ఎదురు కానుంది. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చేందుకు పార్టీ నాయ‌కులు ..అనేక మంది వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని  ప‌నిచేశారు. ఎంతో మంది అలుపెరుగ‌ని క‌ష్ట‌మూ ప‌డ్డారు. కొంద‌రు టికెట్లు ఆశించి భంగ ప‌డ్డారు. మ‌రికొంద‌రు సిట్టింగు స్థానాల‌నుకూడా.. చంద్ర‌బాబు కోరిక మేర‌కు త్యాగం చేశారు. వీరిలో దేవినేని ఉమా, మంతెన రామ‌రాజు.. వంటి ఉద్ధండ నాయ‌కులు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వీరంతా చంద్ర‌బాబుక‌రుణ కోసం వేచి చూస్తున్నారు. ఎందుకంటే.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు రానుంది.


రాష్ట్రం వైసీపీ 56 సామాజిక వ‌ర్గాల‌కు కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసింది. వీటికి చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్ల‌ను కూడా నియ‌మించింది. అయితే.. స‌ర్కారు మార‌డంతో వారంతా రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఆయా ప‌ద‌వుల విష‌యంలో టీడీపీ నాయ‌కులు పోటీలో ఉన్నారు. అయితే.. త్యాగాలు చేసిన వారికి ఈ ప‌ద‌వులు ద‌క్కే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంది. పైగా వారు కూడా వీటిని తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో వీరికి వేరేగా నామినేటెడ్ ప‌ద‌వులు సృష్టించ‌డ‌మో.. లేక‌.. రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం, అమ‌రావ‌తి రీజియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ చైర్మ‌న్ వంటి ప‌ద‌వుల కోసం వారు ఎదురు చూస్తున్నారు.


కీల‌క నేత‌ల‌ను ప‌క్క‌న పెడితే.. జిల్లాల స్థాయిలో కులాల వారీగా కూడా నాయ‌కులు ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌కు ఈ సారి టికెట్ ద‌క్క‌లేదు. ఆయ‌న త‌న స్థాయికి త‌గిన ప‌ద‌వి కోసం వేచి చూస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి వ‌చ్చి పార్టీ కోసం ప‌నిచేసిన జంగా కృష్ణ‌మూర్తి, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు వంటి వారు కూడా.. ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు పాత కాపులు, సీనియ‌ర్లు.. అయిన‌.. ప్ర‌తిభా భార‌తి వంటివారు కూడా ఉన్నారు. శ‌మంత‌క‌మ‌ణి కుమార్తె యామినీ బాల కూడా.. ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ప‌ద‌వులు త‌క్కువ‌గా ఉన్నా.. నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నారు.


వీరిని మేనేజ్ చేయ‌డం.. అంద‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌డం.. వంటివి క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌విని దేవినేని ఉమాకు అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని వ‌ర్ల రామ‌య్య‌కు, ఎస్టీకి సంబంధించిన ప‌ద‌వుల‌ను ఆయా వ‌ర్గాలకు చెందిన సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు క‌ట్ట‌బెట్టే అవ‌కాశం ఉంది. అయితే.. బీసీల్లో ఎక్కువ మంది ఉండ‌డంతో వీరిలో ఎంత మందికి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌నేది చూడాలి. మొత్తంగా ఎలా చూసుకున్నా.. చంద్ర‌బాబుకు ఈ ప‌ద‌వుల పంప‌కం బిగ్ టెస్ట్‌.. గానే ఉండ‌నుంద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: