ఇక, ఈ నెల 15 నుంచి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాలనను అందించేందుకు అన్ని వ్యవస్థలను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. సంక్షేమం- అభివృద్ధి రెండు వైపులా సాధించేందుకు వీలుగా ప్లాన్ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అమలు చేసి పెన్షన్ల పంపిణీని కొనసాగిస్తున్నారు. మరోవైపు.. మిగిలి ఉన్న ఇతర పథకాల జోలికి ఇప్పటికీ వెళ్లలేదు. వీటిపై ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
వీటిలో ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అదేవిధంగా అన్న క్యాంటీన్లను ఏర్పా టు చేసే విషయంపై ఈ నెల 15 నుంచి అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అంటే.. సంక్షేమ పథకాల్లో కీలకమైన రెండు అంశాలను ఈ నెలలో ప్రారంభించనున్నారు. ఇక, అభివృద్ధి పరంగా చూస్తే.. ఈ నెల 15 నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులకు మరమ్మతులు కల్పించనున్నారు. దీంతో ఇప్పటి వరకు ఇబ్బందులు పడిన ప్రజలకు కొంత ఊరట లభించనుంది.
మరో కీలక విషయం.. ఈ నెల 15 నుంచి అమరావతి పనులు ప్రాథమికంగా ప్రారంభించాలని నిర్ణయించా రు. అంటే.. నిలిచిపోయిన నీళ్లను తోడించడం.. భవనాలకు మరమ్మతులు చేయడం.. రాజధాని ప్రాంతం లోని రోడ్లను తిరిగి సుందరంగా తీర్చిదిద్దడం.. వంటి కీలక పనులు చేపట్టనున్నారు. ఇక, వీలైనంత వరకు.. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. ఈ రెండు పనులు చేయడం ద్వారా.. రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టయింది. మొత్తంగా ఈ నెల 15 నుంచి పాలనలో మెరుపులు అయితే కనిపించనున్నాయని అంటున్నారు.