ఇదేంటి? అనుకుంటున్నారా? ఎస్టీలను కూడా వర్గీకరించాలనే డిమాండ్ ఏపీ సహా తెలంగాణ, మహారా ష్ట్రలలో పెద్ద ఎత్తున ఉన్న విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎస్సీల వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో తమ సంగతేంటని ఎస్టీలు గళం విప్పుతున్నారు. వీటికి సంబంధించి స్థానిక కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. అవి ప్రస్తుతం విచారణ దశలోనే ఉన్నాయి. దీంతో వీటిని కూడా పరిష్కరించాలన్నది వారి డిమాండ్.
ఏంటీ సమస్య..
మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భారీ సంఖ్యలో ఉన్న లంబాడీలు అక్కడ బీసీలుగా ఉన్నారు. కానీ, వీరిని ఏపీ, తెలంగాణలోకి వచ్చే సరికి ఎస్టీలుగా గుర్తించారు. దీంతో గత రెండు దశాబ్దాలుగా మహారాష్ట్రలోని లంబాడీలు.. ఏపీకి వలస వచ్చేసి ఇక్కడే స్థిరపడి ఎస్టీలుగా కొనసాగుతున్నారు. వీరిని ఎస్టీల పరిధి నుంచి తప్పించాలని కోయ, బోయ వంటి పలు సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసులు నమోదయ్యాయి.
ఇక, ఏపీలో ఉన్న వడ్డెరలు.. బీసీలుగా ఉన్నారు. కానీ, వారి డిమాండ్ తమను ఎస్టీలుగా గుర్తించాలని! తాము చేసే పనుల ఆధారంగా తమను ఎస్టీలుగా చేర్చాలని.. కోరుతున్నారు. దీనిపై కేసులు నమోదు కాలేదు కానీ.. చిత్తూరు, అనంతపురం, ఉమ్మడి కృష్ణా వంటి జిల్లాల్లో వడ్డరె కులస్థులు మాత్రం ఈ డిమాండ్ ను ఎప్పటి నుంచో వినిపిస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాదిలోనూ ఈ తరహా డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్టీలు కూడా ఇప్పుడు తమ వర్గీకరణ విషయాన్ని తేల్చాలనే డిమాండ్లను తెరమీదకు తెస్తుండడం గమనార్హం.