ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నికలలో చంద్రబాబు కేవలం 23 సీట్లకు పరిమితమయ్యారు. ఆ ఫలితాలు చూసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసలు పార్టీ బతుకుతుందా ? మరోసారి తాము అధికారంలోకి వస్తామా అన్న డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అక్కడ నుంచి కోలుకుని ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు ఏకంగా 164 సీట్లతో అధికారంలోకి వచ్చి వైసీపీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. అయితే జగన్ ఓటమించి త్వరగా కోలుకుని మళ్ళీ పోరాటం ప్రారంభించడం వైసీపీ శ్రేణులలో ఎక్కడా లేని జోష్ తెచ్చిపెట్టింది. పులివెందులలో వైసీపీ కార్యకర్తలను కలవటం ... వినుకొండకు వెళ్లి హత్యకు గురైన రషీద్ కుటుంబానికి అండగా నిలవడం .. తాడేపల్లిలో ఇప్పుడిప్పుడే కేడర్ కోసం తలుపులు తెరుస్తూ ఉండటం లాంటివి మంచి పరిణామాలు అని వైసిపి నాయకులు చెబుతున్నారు.
జగన్ కు క్యాడర్కు మధ్య గ్యాప్ లేకుండా చేయాలి.. వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడలు పూర్తిగా తొలగాలి. వైసిపి కార్యకర్తలు ముందు నుంచి ఇదే కోరుకుంటున్నారు. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ కొందరు నాయకులు అడ్డుగోడలుగా ఉండి కార్యకర్తలకు జగన్‌కు... ఎమ్మెల్యేలకు జగన్ కు మధ్య కంచెలు వేశారు. దీంతో జగన్ పూర్తిగా ప్రజలకు కార్యకర్తలకు దూరం అయిపోయారు. ఇదే పార్టీ ఘోరపరాజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.