వైసీపీలో సీనియర్ నేతలు అందరూ సైలెంట్ అయిపోయారు. ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. అయితే ఇప్పుడు పార్టీలో యువ నేతలు తిరుగుబాటు సంకేతాలు పంపుతున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది యువ నేతలు అసమ్మ‌తి గళం వినిపించారు. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మొదట్లోనే జగన్ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు. ధనుంజయ రెడ్డిని అడ్డంపెట్టి నిండా ముంచేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మార్గాని భ‌ర‌త్ కూడా అదే చెప్తున్నారు. జగన్ రెడ్డికి ఏమీ తెలియదని అందుకే లిక్కర్ బ్రాండ్లు ఇతర విషయాల్లో తప్పులు జరిగాయని ఆయన చెప్పారు.. ఇప్పటికీ చెబుతున్నారు.


ఇక ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఏదోలా జగన్ ను ఇరుకునపెట్టేలా మాట్లాడుతున్నారు. పైగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ జగన్ చర్యలను తప్పుపడుతున్నారు. అప్పుడే కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేయకూడదని ... ప్రభుత్వానికి ఈ ఏడాది డిసెంబర్ వరకు టైం ఇవ్వాలని కేతిరెడ్డి చెబుతున్నారు. ఇక గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపింది. మరికొందరు యువ నేఉల‌త‌ కూడా నేరుగా మీడియా ముందుకు రాకపోయినా జగన్మోహన్రెడ్డి చేసిన రాజకీయంతో తమ‌ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయిందని లబోదిబో అంటున్నారు.


అందుకే చాలావరకు మౌనం పాటిస్తున్నారు. జగన్ ఢిల్లీ ధర్నాకు వెళ్లిన వారిలో ఒకరిద్దరు యువ నేతలు తప్ప ఎక్కువ మంది కనిపించలేదు. రాజకీయ నేపథ్యం ఉండి వారసత్వంతో ఎదగాలనుకుంటున్న నేతలు జగన్ రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చాలావరకు మౌనం పాటిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ రెడ్డిని సమర్థించి తాము సమస్యలలో పడటం కన్నా ... కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని ప్రకటనలు చేసి సేఫ్ గా ఉండాలని యువనేత‌లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: